రూ.15 కోట్లు పంచారట..! : MP కొండా బంధువు అరెస్ట్

రూ.15 కోట్లు పంచారట..! : MP కొండా బంధువు అరెస్ట్

హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఎస్ఐఎన్ టవర్ వద్ద  పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సందీప్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సందీప్ రెడ్డి చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి దగ్గర  2008 నుంచి పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సమీప బంధువైన సందీప్ రెడ్డి  ఆయన ఆర్థిక లావాదేవీలు చూస్తున్నారని చెప్పారు.

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిదిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంత డబ్బు పంపిణీ చేయాలి.. ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత ఇవ్వాలో పూర్తి వివరాలను సందీప్ రెడ్డి తన డైరీలో కోడ్ రూపంలో రాసుకున్నాడు. ఆ డైరీని పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు రూ.15 కోట్లు వరకూ నగదు పంపిణీ చేసినట్లు  పోలీసులు గుర్తించారు.  సందీప్ రెడ్డి దగ్గర స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పోలీసు అధికారులు డీకోడ్  చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఐటీ అధికారులకు సమాచారం  ఇచ్చారు పోలీసులు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు రూ. 15 కోట్లకు పైగా నగదును కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సందీప్ రెడ్డి కలిసి పంచినట్లుగా గుర్తించారు. మంగళవారంనాడు కొన్ని గంటలపాటు సందీప్‌ని ప్రశ్నించిన ఐటీ అధికారులు… మరోసారి తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించారు.