జల్సాల కోసం చోరీలు.. కొరియర్​ బాయ్​ అరెస్ట్

జల్సాల కోసం చోరీలు.. కొరియర్​ బాయ్​ అరెస్ట్
  •  12 తులాల గోల్డ్, 52 వేల క్యాష్​ స్వాధీనం

సికింద్రాబాద్, వెలుగు: జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడుతూ కార్ఖానా పోలీసులకు చిక్కాడు. అతని నుంచి రూ.10లక్షల విలువైన12 తులాల బంగారు ఆభరణాలు, రూ.52 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుమలగిరి ఏసీపీ రమేశ్, ఇన్​స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్​పల్లి మహాత్మనగర్ లో ఉండే ఎర్పులగాల్వ కల్యాణ్ కుమార్(30) కొరియర్​బాయ్​గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన కల్యాణ్​ఈజీ మనీ కోసం చోరీలు స్టార్ట్​చేశాడు.

పనిలో భాగంగా పగటిపూట బయటికి వెళ్లినప్పుడు తాళాలు వేసి ఉన్న ఇండ్లలో చొరబడి దొరికినకాడికి దోచేస్తున్నాడు. గత నెల 29న అల్వాల్ ఏరియాలోని శ్రీనివాస్ నగర్ కాలనీకి వెళ్లాడు. అక్కడి రెండు అంతస్తుల బిల్డింగ్​లో చొరబడ్డాడు. మొదట గ్రౌండ్​ఫ్లోర్​లోని ఇంట్లో, తర్వాత ఫస్ట్​ఫ్లోర్​లోని రెండు ఇండ్లలో మొత్తం రూ.32 వేలు చోరీ చేశాడు. ఈనెల 5న కార్ఖానా ఓల్డ్ వాసవీ నగర్​చోళస్ రెసిడెన్సీ నాలుగో అంతస్తులోని ప్లాట్​కు వెళ్లాడు.

తాళం పగలగొట్టి బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కార్ఖానా పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా కల్యాణ్ కుమార్ ను పట్టుకున్నారు. 12 తులాల బంగారు ఆభరణాలు, రూ.52 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.