
- యువకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు అరెస్ట్
సిద్దిపేట రూరల్, వెలుగు: అశ్లీల ఫొటోలు, వీడియోలు ఎర చూపి యువతను మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. సీపీ ఎన్.శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణం ఖిలాగడ్డకు చెందిన అరేపల్లి అభిషేక్, కరీంనగర్ జిల్లా పెద్దపాపాయపల్లికి చెందిన భాషవేన అభినాష్ అమ్మాయిల పేరిట ఫేక్ ప్రొఫైల్క్రియేట్ చేసి యువకులను ఆకర్షించేవారు. అశ్లీల ఫొటోలు, న్యూడ్చార్జ్ చేసి ఆ సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడ్తామని, సైబర్ పోలీసులమని బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు.
ఈ విషయంలో బేగంపేట పోలీస్ స్టేసన్ పరిధిలో కేసు నమోదు కావడంతో గజ్వేల్ ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. సోమవారం మధ్యాహ్నం కుకునూరుపల్లి బస్టాండ్ వద్ద డబ్బులు తీసుకుంటున్నారని తెలిసి తోగుట సీఐ కమలాకర్, బేగంపేట ఎస్ఐ అరుణ్ ప్లాన్ ప్రకారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 బైక్లు, మూడు సెల్ ఫోన్లు, 8వేల నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. గజ్వేల్ ఏసీపీ రమేశ్, తోగుట సీఐ కమలాకర్, బేగంపేట ఎస్ ఐ అరుణ్, కానిస్టేబుళ్లను అభినందించారు.