నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టయ్యింది. అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న నిందుతులను బాలానగర్ ఎఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. "అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాను పట్టుకున్నాము. బొలేరో వాహనంలో సీడ్స్ తరలిస్తుండగా పట్టుకున్నాం..ఇందులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ముఠా నుండి రూ.85 లక్షల విలువైన 2.65 టన్నుల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నాం. బాచూపల్లి, బాలానగర్, షాబాద్ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు సప్లై చేస్తుండగా పట్టుకున్నాము. అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో కలిసి నిందితులను అరెస్ట్ చేశాము.

BG–3/HT విత్తనాలను తెలంగాణలో బ్యాన్ చేశారు. వాటినే ఈ నిందితులు సప్లై చేస్తున్నారు. బ్రాండెడ్ సీడ్ పౌచ్ లను తయారు చేసి.. అందులో ఈ విత్తనాలను ప్యాక్ చేసి డీలర్స్ కి, రైతులకు అమ్ముతున్నరు. రానున్న రోజుల్లో విస్తృతంగా దాడులు చేసి నకిలీ విత్తనాలు పట్టుకుంటాము. పట్టుబడ్డ నిందితులపై గతంలో కూడా కేసులున్నాయి కాబట్టి వారిపై పీడీ యాక్టు పెడతాం" అని సీపీ తెలిపారు.

"తక్కువ ధరకు విత్తనాలు ఇస్తాం అని నకిలీ విత్తనాలు రైతులకు అమ్ముతున్నారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు ప్యాకెట్ పైన వివరాలన్నీ చూసుకోవాలి. ప్రభుత్వం నిర్దారించిన ధర కన్నా తక్కువకే విత్తనాలు ఇస్తామని ఆశచూపితే.. మోసపోవద్దు. లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరే.. బిల్ తీసుకొని సీడ్స్ కొనాలి. ఎక్స్పైరీ అయిన విత్తనాలు కలర్ వేసి రైతులకు అమ్ముతున్నారు" అని వ్యవసాయ అధికారి గీతా సూచించారు.