- ముందుగా రూ. 30 వేలకు విక్రయించిన తల్లిదండ్రులు
- అనంతరం కిడ్నాప్ చేశారని డయల్ 100 కంప్లయింట్
- ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన ఆర్మూర్ పోలీసులు
ఆర్మూర్, వెలుగు: బాలుడు అమ్మకం.. కిడ్నాప్ చేశారంటూ కంప్లయింట్ చేసిన కేసులో ఐదుగురిని నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మూర్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆర్మూర్ మున్సిపల్‌పరిధిలోని పెర్కిట్‌కు చెందిన అరగంటి లక్ష్మి, పోశెట్టి దంపతులకు ఏడు నెలల బాలుడు ఉన్నాడు. తమ చిన్నారిని అమ్మేందుకు తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్, షేక్ హబీబ్ తో రూ.30 వేలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే.. నిర్మల్‌లో ఉంటున్న తన కూతురు రషీద, అల్లుడు మహ్మద్ కు పిల్లలు లేకపోవడంతో బాబును కొనుగోలు చేసి ఇచ్చేందుకు మహమ్మద్ గౌస్ నిర్ణయించుకున్నాడు. డబ్బులు తీసుకోవడం, బాబును అమ్మడం జరిగిపోయాయి.
ఆ తర్వాత మనసు మార్చుకున్న లక్ష్మి డయల్100 కు కాల్ చేసి బాబును ఎవరో కిడ్నాప్ చేశారని కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా బాబును తల్లిదండ్రులే అమ్మినట్టు తేలింది. దీంతో లక్ష్మి, పోశెట్టి దంపతులతో పాటు కొనుగోలు చేసిన గౌస్, షేక్ హబీబ్, మహ్మద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. బాబును చైల్డ్ హోమ్ కు తరలించినట్లు చెప్పారు.