సికింద్రాబాద్, వెలుగు: తోటి రైలు ప్రయాణికుడికి మత్తు బిస్కట్లు ఇచ్చి, నగలు కొట్టేసిన నలుగురిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4.50 లక్షల బంగారం, రూ.50 వేల నగదును రికవరీ చేవారు. రైల్వే అర్బన్ డీఎస్పీ జావేద్, కాచిగూడ సీఐ ఎల్లప్ప కలిసి ఈ కేసు వివరాలను మీడియాకు గురువారం వెల్లడించారు. యూపీకి చెందిన సురేంద్ర అలియాస్ సోను (38), జాన్ మహమ్మద్ చౌదరి (37), కృష్ణ కుమార్ (22), దిలీప్ వర్మ (19).. సిటీలోని అంబర్పేట్, నాగోల్ ప్రాంతాల్లో వేర్వేరుగా నివాసం ఉంటూ పాల్సీలింగ్ పనులు చేస్తున్నారు.
ఈ నెల 18న వీరు బెంగళూరుకు టికెట్కు తీసుకొని కాచిగూడ– -మైసూర్ ఎక్స్ప్రెస్ రైలుఎక్కారు. వీరి పక్కనే కూర్చున్న కర్నాటక హాసన్ జిల్లాకు చెందిన సిద్దేశ్(49)ను తొలుత మాటల్లో దించి బిస్కెట్లు ఇచ్చారు. వాటిని తిన్న కొద్దిసేపటికి మత్తులోకి వెళ్లడంతో అతడి బ్యాగును దొంగలించి తర్వాతి స్టేషన్లో దిగిపోయారు. మిస్సైన బ్యాగులో 70 గ్రాముల బంగారం, రూ.50 వేల నగలు ఉన్నట్లు కాచిగూడ రైల్వే పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీపుటేజీ ఆధారంగా నలుగురిని గురువారం అరెస్టు చేశారు.