గద్వాల, వెలుగు: బ్రాండెడ్ కంపెనీ ఫర్టిలైజర్ ముసుగులో నకిలీ ఫర్టిసైడ్స్అమ్ముతున్న ముఠా గుట్టును జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు రట్టు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు రెండు షాపులపై ఫిర్యాదు రావడంతో ఎంక్వైరీ చేయగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ లో మూలాలు ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో అడిషనల్ ఎస్పీ రవి వివరాలు తెలియజేశారు. ఇటిక్యాల మండలం శ్రీనివాస ఆగ్రో ట్రేడర్స్ డీలర్, ఐజ టౌన్ లోని జై కిసాన్ ఎంటర్ప్రైజెస్ డీలర్.. ట్రేసర్, డెలికేట్(మిరప పంటలో తెగుళ్లకు వాడే నీలిమందు) ఫర్టిలైజర్స్‌కు బదులు నకిలీవి అమ్ముతున్నారని సదరు కంపెనీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సీసీఎస్ఇన్స్పెక్టర్రామస్వామి ఐజ, ఇటిక్యాల ఎస్ఐలు నరేశ్, అశోక్ బాబు కేసు నమోదు చేసుకొని రెండు షాపుల ఓనర్లయిన మోహన్ గౌడ్, తిమ్మారెడ్డిని ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటపెట్టారు. పులికల్ కు చెందిన జావేద్ జమీర్, ఐజ టౌన్ కు చెందిన జావీద్ హుస్సేన్..ఏపీలోని నంద్యాల జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన విజయకుమార్ ద్వారా నకిలీవి తీసుకొచ్చి ఇచ్చారని చెప్పారు.
విజయ్ కుమార్ గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి నుంచి తీసుకొచ్చారని, విష్ణువర్ధన్ రెడ్డికి రాజస్థాన్ నుండి అంకిత్, మధ్యప్రదేశ్ కి చెందిన సునైల్ కార్యం సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఎనిమిది మంది ముఠాలో సోమవారం ఆరుగురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. ఈ సందర్భంగా 10 నకిలీ డెలికేట్ బాటిల్స్, 10 నకిలీ ట్రేసర్ బాటిల్స్‌ను సీజ్
చేశామన్నారు.