డీఆర్డీఓ రైస్​పుల్లింగ్ అంటూ టోకరా.. రూ.25 లక్షలు మోసగించిన ముఠా అరెస్ట్

డీఆర్డీఓ రైస్​పుల్లింగ్ అంటూ టోకరా..  రూ.25 లక్షలు మోసగించిన ముఠా అరెస్ట్

సికింద్రాబాద్, వెలుగు: రైస్​పుల్లింగ్ పేరుతో  రూ.25 లక్షల మోసానికి పాల్పడిన ముఠాను నార్త్​జోన్​టాస్క్​ఫోర్స్, మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్​ఓల్డ్ అల్వాల్​కు చెందిన పగిడిమర్రి శివ సంతోశ్ కుమార్(43), ఏపీ చిత్తూరు జిల్లాకు చెందిన గుల్లూరు మంజునాథ్​ రెడ్డి (38), బెంగుళూరుకు చెందిన ప్రతాప్​ఎస్ఆర్​అలియాస్ రవీందర్​ ప్రసాద్ (44) కలిసి రాణిగంజ్​కు చెందిన శశికాంత్​ను కలిశారు. రాగి పాత్ర చూపించి దీనికి అతీత శక్తులు ఉన్నాయని,  ఇందులో డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయని నమ్మబలికారు. ఈ పాత్రను డీఆర్డీఓలో మాత్రమే ప్రత్యేకంగా తయారు చేస్తారని, కొనుగోలు చేయాలంటే  రూ. 25 లక్షలు చెల్లించాలని సూచించారు.

పాత్ర నాణ్యతను కూడా డీఆర్డీఓలో స్కానర్ ​ద్వారా టెస్టింగ్ చేయించి అందజేస్తామన్నారు.  ఇది నమ్మిన శశికాంత్​ఈ నెల 6న సికింద్రాబాద్​ రాణిగంజ్​లోని బాంబే హోటల్ లైన్​లో శివ సంతోశ్ కుమార్​ను కలిసి రూ.25 లక్షలు చెల్లించాడు. అయితే, డీఆర్డీఓ స్కానర్ కూడా ఇవ్వాలని అడగడంతో​మరో రూ.23 లక్షలు చెల్లించాలని, అప్పుడే రైస్​పుల్లింగ్ చేయగలరని చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన శశికాంత్​ మహంకాళి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో మహంకాళి సీఐ​పరశురామ్​, టాస్క్ ఫోర్స్​సీఐ​ సైదులు తమ టీమ్​లతో కలిసి  నిందితులను సికింద్రాబాద్​లో అరెస్టు చేశారు. రూ.25లక్షల నగదు, మరో రూ.2 లక్షల విలువ చేసే ఏడు సెల్​ఫోన్​లు, రాగి పాత్రను స్వాధీనం చేసుకొని, నిందితులను  రిమాండ్​కు తరలించారు.