సిరిసిల్ల టౌన్, వెలుగు: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఆఫీస్లో ఈ కేసు వివరాలను ఎస్సీ అఖిల్ మహాజన్ శుక్రవారం వెల్లడించారు. ‘‘తంగళ్లపల్లి మండలానికి చెందిన క్రాంతి వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించి ఇక్కడ అమ్ముతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా గాయిదిగూడ మండలం రూపావాడకు చెందిన మాడవి దిగంబర్, తుంరమ్ అమృత్ రావు శుక్రవారం గంజాయిని తీసుకొని క్రాంతి వద్దకు వస్తున్నారని సమాచారం అందింది.
దీంతో తంగళ్లపల్లి గ్రామ శివారులో నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద 3 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాం. పరారీలో ఉన్న క్రాంతిని త్వరలో పట్టుకుంటాం”అని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐలు మొగిలి, ఎస్సై సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.