ఒడిశా నుంచి హైదరాబాద్ కు కారులో గంజాయి

ఒడిశా నుంచి హైదరాబాద్ కు కారులో గంజాయి
  • ఒడిశా నుంచి సిటీకి సరఫరా
  •  రూ.18 లక్షల విలువైన  57 కిలోల గంజాయి స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: కారు డోర్లలో ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేసి ఒడిశా నుంచి సిటీకి గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.  సిటీలోకి ఎంటర్​కాగానే ముందు ఒక బైక్​పై ఎస్కార్ట్ గా ఉండే వ్యక్తి  గమనిస్తూ వెళ్తాడు. ఎక్కడైనా పోలీసు తనిఖీలు జరిగితే సమాచారమిచ్చి అలర్ట్​చేస్తాడు. ఈ ముఠాను చందానగర్​ గంగారం హనుమాన్​ టెంపుల్​వద్ద చందానగర్, ఎస్​ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  రూ.18 లక్షల విలువైన 57 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.  గచ్చిబౌలిలోని మాదాపూర్​డీసీపీ ఆఫీస్‌లో  డీసీపీ జి. వినీత్​ వివరాలు వెల్లడించారు.  

ఎస్కార్ట్​గా బైక్​పై ఇద్దరితో...

హర్యానాలోని దివాని ప్రాంతానికి చెందిన చమన్ అదే రాష్ట్రానికి చెందిన రాకేశ్​దగ్గర ఒడిశాలో గంజాయి కొనేవాడు. తన కారు డోర్లకు ఉండే స్పీకర్లను తొలగించి ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేయించి అందులో గంజాయి పెట్టి ఈనెల 29న సిటీకి తీసుకువస్తున్నాడు.  ఔటర్ రింగురోడ్డు మీదుగా పటాన్ చెరు వద్దకు చేరుకున్న తర్వాత తన స్నేహితులైన బోయినపల్లికి చెందిన శివంపేట ఉమాకాంత్, అర్జున సాయి కృష్ణలకు ఫోన్ చేశాడు. 

పటాన్​చెరు నుంచి ఉమాకాంత్, కృష్ణ టూ వీలర్​పై ఎస్కార్ట్​గా ముందు వెళ్తుండగా, వెనకాలే గంజాయి  ఉన్న కారుతో చమన్​ వస్తున్నాడు. సమాచారం అందుకున్న చందానగర్, ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టి చమన్, ఉమాకాంత్, సాయికృష్ణను అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రాకేశ్​ఒడిశా నుంచి గంజాయి తెస్తే అమ్మే బాధ్యతను ఉమాకాంత్, సాయి కృష్ణను తీసుకున్నారని తేలింది. కారు, టూవీలర్​, సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించారు. 

కారు బానెట్ ఎండు గంజాయి.. 

కారు ఇంజిన్​పై భాగంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకునేలోగా పారిపోయాడు. శంషాబాద్​డీటీఎఫ్, సరూర్​నగర్​డీటీఎఫ్​, శేరిలింగంపల్లి ఎక్సైజ్​ఇన్​స్పెక్టర్లు నానాక్​రాంగూడ ఓఆర్ఆర్​  మీనాక్షి అపార్ట్​మెంట్స్ సమీపంలో తనిఖీలు చేస్తున్నారు. అటువైపు వచ్చిన ఓ కారును ఆపగా డ్రైవర్​కారు వదిలి పారిపోయాడు. పరిశీలించి చూడగా ఇంజిన్​పైభాగంలో13 ప్యాకెట్లలో 20.19 కిలోల డ్రై గంజాయి కనిపించింది. 

కారులో దొరికిన ఓటర్​ఐడీ అధారంగా నిందితుడిని ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లా గుముక తాలుకాకు చెందిన బిక్రమ్​ హీరా(24)గా గుర్తించారు. పట్టుబడిన గంజాయి ధర రూ.5 లక్షల పైనే ఉంటుందని, కేసు నమోదు చేసుకొని బిక్రమ్​ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.  అలాగే వికారాబాద్ రైల్వే హాస్పిటల్ దగ్గర తనిఖీ చేయగా లింగంపల్లి కి చెందిన ఎండీ అఖిల్ పాషా దగ్గర 210 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. గంజాయిని సీజ్ చేసి అఖిల్ పాషాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిస్ట్రిక్ట్​ టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.