గంజాయిని జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దాకా తీసుకొచ్చారు.. కారులో 115 కేజీలు దొరికింది..!

గంజాయిని జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దాకా తీసుకొచ్చారు.. కారులో 115  కేజీలు దొరికింది..!

పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా గంజాయి స్మగ్లర్లు తగ్గడం లేదు. ఏదో ఒక రూట్లో నుంచి హైదరాబాద్ కు సరఫరా చేస్తూనే ఉన్నారు. అందుకోసం మహిళలను, స్టూడెంట్స్ ను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా దుండగులు కారులో ఒకటి కాదు రెండు కాదు 115 కేజీల గంజాయిని కూకట్ పల్లి జేఎన్టీయూ వరకు తీసుకొచ్చి దొరికిపోయారు. వీరితో పాటు ఇవాళ (సోమవారం, మార్చి 24) ముగ్గురు బీటెక్ విద్యార్థులు గంజాయి కేసులో అరెస్టు కావడం సంచలనంగా మారింది.

హైదరాబాద్‌ జెఎన్‌టీయు మెట్రో స్టేషన్‌ సమీపంలో కారులో 115   కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కారులో తెచ్చిన గంజాయిని అమ్మడానికి  ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎక్సైజ్‌ ఎస్ టి ఎఫ్ సి టీమ్‌ చాకచక్యంగా పట్టుకుంది. ఈ కేసులో పట్టుబడిన గంజాయి డాన్ గా పిలవబడే వ్యక్తి దుగ్యంపూడి శివారెడ్డిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్ మెంట్‌ జాయింట్‌ కమిషనర్‌ ఖురేషి తెలిపారు. అదే విధంగా ముగ్గురు బీటెక్ విద్యార్థుల నుంచి కూడా 4 కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

  నిందితుల నుంచి రెండు కేసుల్లో  మొత్తం119 కేజీల గంజాయిని  స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పట్టుకున్న గంజాయి విలువ  రూ.60 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.  గంజాయ తో పాటు కారు, సెల్‌ ఫోన్ల విలువ మరో 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ఒరిస్సా నుంచి పలు రాష్ట్రాలకు గంజాయి సరపరా చేస్తూ గంజాయి డాన్‌ ముద్రావేసుకున్న దుగ్యంపూడి శివారెడ్డి అనే వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శివారెడ్డి గతంలో కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో 2019లో 150 కేజీలు, 2022లో 400కేజీలు, 2024లో రెండు మార్లు 240, 120 కేజీలతో ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డాడని తెలిపారు. శివ శంకర్‌రెడ్డి అలియాస్‌ శివారెడ్డి  కొత్తగూడెం భద్రాద్రి జిల్లా  భూర్గుపాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ నిందితుడిపై పీటి వారెంట్‌ కూడ  ఉంది.కారులో ఉన్న మరోఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

మరో కేసులో జేఎన్‌టీయు కేపీహెచ్‌బి వసంతనగర్‌ కాలనీలో ముగ్గురు విద్యార్ధులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులు అద్దెకు ఉంటున్న  ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుపగుతున్నాయనే సమాచారం  మేరకు ఎస్ టి ఎఫ్  సీ టీమ్‌ పోలీసులు దాడులు నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు.

ఈ కేసులో బి.కాం కంప్యూటర్‌ సైన్స్‌ చేసిన కరీంనగర్‌ జి ల్లా సుల్తాన్‌పూర్‌కు చెందిన రాహుల్‌ (23) పెద్దపల్లి భూంనగర్‌ నివాసి పరికిపండ్ల అజయ్‌ కుమార్‌, పెద్దాపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలానికి  చెందిన తాడిపల్లి అభిలాష్ లను అరెస్టు చేశారు. వీరి వద్ద ఉన్న 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లోని నిందితులను  బాలనగర్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.