ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి

ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి

సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 35 మంది నుంచి రూ. 45 లక్షలు వసూలు
ఏపీకి చెందిన యువకుడు అరెస్ట్

హనుమకొండ, వెలుగు: ఎంబీఏ చదివిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం మోసాల బాట పట్టాడు. సాఫ్ట్‌‌‌‌ వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. 45 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేయడంతో పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసు వివరాలను సైబర్‌‌‌‌ క్రైమ్స్‌‌‌‌ ఏసీపీ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ శుక్రవారం వెల్లడించారు. ఏపీలోని ఏలూరు జిల్లా చిట్టాపూర్‌‌‌‌కు చెందిన పొనగంటి సాయితేజ ఎంబీఏ పూర్తి చేశాడు. తర్వాత కొన్ని కంపెనీల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. జల్సాలకు అలవాటు పడిన సాయితేజ ఈజీ మనీ కోసం ఆన్‌‌‌‌లైన్​ నేరాలకు ప్లాన్‌‌‌‌ చేశాడు.

ఇందుకోసం ఉద్యోగ అవకాశాలు కల్పించే పలు వెబ్‌‌‌‌సైట్ల నుంచి నిరుద్యోగుల ఫోన్‌‌‌‌ నంబర్లు సేకరించాడు. తర్వాత వారికి ఫోన్‌‌‌‌ చేసి సాఫ్ట్‌‌‌‌ వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చెప్పడంతో పాటు ఇంటర్వ్యూ, టెస్టులకు సంబంధించి ట్రైనింగ్‌‌‌‌ కూడా ఇస్తానని నమ్మించాడు. ఇందుకు కొంత డబ్బు చెల్లించాలంటూ రూ. లక్షల్లో వసూలు చేశాడు. ఇలా కొన్ని రోజుల కిందట హనుమకొండ ప్రాంతంలోని ఓ నిరుద్యోగి నుంచి సుమారు రూ.3 లక్షల వరకు వసూలు చేసి తర్వాత ఫోన్‌‌‌‌ స్విచాఫ్‌‌‌‌ చేసుకున్నాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు వరంగల్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌లోని సైబర్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఏపీకి వెళ్లి సాయితేజను అదుపులోకి తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.45 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఏసీపీ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌, సీఐ రవి, ఎస్సైలు శివ, చరణ్‌‌‌‌, కానిస్టేబుల్స్‌‌‌‌ ఆంజనేయులు, మహేందర్‌‌‌‌, రాజు, సంపత్‌‌‌‌ను సీపీ అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝా అభినందించారు.