బెట్టింగ్ ముఠా అరెస్ట్..ఇద్దరు మహిళలు కూడా..

ఐపీఎల్  వచ్చిందంటే చాలు పరుగుల మోతతో పాటు బెట్టింగ్ దందా కూడా గట్టిగానే నడుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తూ అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. క్రికెట్ అంటే ఇష్టమున్న ప్రతీ ఒక్కరు బెట్టింగ్ పెడుతూ డబ్బులు దండుకుంటున్నారు. అయితే వీరిపై నిఘా పెట్టి ఎంత మందిని అరెస్ట్ చేసినా మళ్లీ కొత్త కొత్త ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పొలీసులకు చిక్కుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్లో ఓ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 

వరంగల్ నగరంలో గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గడ్, వరంగల్కు చెందిన గ్యాంగ్ ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్నట్లు గుర్తించారు. మొత్తం ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురిలో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం. నిందితుల నుంచి 3 ల్యాప్ టాప్ లు, 13 సెల్ ఫోన్ లు, 1.9 లక్షల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా  వివిధ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్లను సీజ్ చేశారు.