దొరికిన కొండగట్టు దొంగలు

జగిత్యాల జిల్లా కొండగట్టులో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు దొంగలు దొరికినట్లు డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ముగ్గురు దొంగలు కొండగట్టులోని మారుతీ నిలయంలో భక్తులు విడిది చేసిన అద్దె గదుల్లో దొంగతనానికి పాల్పడి 4 వేల నగదు, మూడు సెల్ ఫోన్లు దొంగిలించారని చెప్పారు. అది గమనించిన భక్తులు పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక ఎస్సై చిరంజీవి మల్యాల ఎస్ఐ వెంకటరమణ మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం దొంగల మరి సమీపంలో వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా కనిపించిన స్విఫ్ట్ కారును తనిఖీ చేయగా ముగ్గురు దొరికినట్లు డిఎస్పీ తెలిపారు. 

వీరిని వేములవాడకు చెందిన దూలం శశాంక్, తోకల నితిన్, ఏనుగందుల పవన్ చందు లుగా గుర్తించారు. నిందితులను విచారించగా కొండగట్టులో దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. దొంగతనానికి ఐదుగురు పాల్పడగా వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. కాగా దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులు జల్సాల కోసమే దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. హొలీ పండుగ సెలబ్రేషన్స్ కోసం డబ్బులు అవసరం ఉండి దొంగతనానికి కొండగట్టును ఎంచుకున్నారన్నారు. ఒక అద్దె కారులో కొండగట్టుకు చేరుకొని దొంగతనం చేసినట్లు తెలిపారు. కాగా వరుస దొంగతనాలు పాల్పడుతున్న నేపధ్యంలో కొండగట్టులో భద్రత పెంచుతున్నట్లు వెల్లడించారు. కాగా దొంగతనానికి పాల్పడ్డ నిందితులకు గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.