కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో రూ. 21 లక్షలు దోచుకున్న సైబర్ మోసగాడు అరెస్ట్..

కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో కరీంనగర్ కు చెందిన ఓ మహిళ నుంచి రూ.21.8 లక్షల దోచుకున్న సైబర్ నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇందిరాగాంధీ ఎయిర్పోర్టుకు మీ పేరు మీద వచ్చిన పార్సీల్లో చాలా రకాల బ్యాంక్ ఎటిఎం కార్డ్స్ , డ్రగ్స్  పాస్పోర్ట్స్ దొరికాయంటూ బాధితురాలకు ఫోన్ చేసి బెదిరించారు సైబర్ నేరగాళ్లు. వెంటనే ఢిల్లీ పోలీసులతో మాట్లాడాలంటూ  కాన్ఫరెన్స్ కాల్ లో  వేరే వ్యక్తులతో మాట్లాడించి.. బాధితురాలిని భయపెట్టి ఆమె నుండి రెండు విడతలుగా రూ. 21 లక్షల 80వేల రూపాయలు దోచుకున్నారు కేటుగాళ్లు.

మోసపోయానని గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నేరస్తుడు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలో డబ్బులను ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఒరిస్సాలోని భువనేశ్వర్ జిల్లాలో తలదాచుకున్న సదాన్షు శేఖర్ మహంతిని అదుపులోకి తీసుకొని..  కరీంనగర్ కు తీసుకొచ్చి రిమాండ్ కు తరలించారు.