బ్యాంకులో డబ్బులు వేస్తే ఏడు, ఎనిమిదేళ్లకు మీ డబ్బు రెట్టింపు అవుతుంది.. అదే కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఆరు నుంచి ఏడేళ్లల్లో మీ డబ్బులు డబుల్ అవుతాయి.. అదే మీరు మా స్కీంలో జాయిన్ అయితే జస్ట్ 25 నెలల్లోనే మీ డబ్బులు డబుల్ అవుతాయి.. మీరు 10 లక్షలు పెట్టుబడి పెట్టండి.. రెండేళ్లలో 20 లక్షల రూపాయలు తీసుకెళ్లండి.. ఈ స్కీం చూస్తే ఏమనిపిస్తుంది మీకు..
డబ్బులు చెట్లకు కాస్తున్నాయి అని కదా.. ఇలాంటి స్కీంతో ఏకంగా 3 వేల 600 మందిని మోసం చేశాడు.. వాళ్ల నుంచి 300 కోట్ల రూపాయలు వసూలు చేశాడు.. మరి రెండేళ్లల్లో 300 కోట్లకు 600 కోట్లు తిరిగి ఇవ్వాలి కదా.. ఇవ్వలేదు.. బిచాణా ఎత్తేశాడు.. ఈ మోసం జరిగింది మన హైదరాబాద్ సిటీ నడిబొడ్డున.. ఇప్పుడు బాధితుల కంప్లయింట్స్ తో ఆ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఈ కిలాడీ మోసం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read :- కోఠి మార్కెట్లో ఎమ్మెల్యే దానం పర్యటన
పవన్ కుమార్ అనే వ్యక్తి బై బ్యాక్ పాలసీ, డబుల్ గోల్డ్ స్కీం పేరుతో భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ స్కాంలో 3వేల 600 మంది దగ్గర నుంచి 300 కోట్లు కాజేశాడు పవన్ కుమార్. వెల్త్ కాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించిన పవన్.. 25నెలలకు గాను బై బ్యాక్ ఓపెన్ ప్లాట్స్ స్కీం ప్రారంభించి పెట్టుబడిదారుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున సొమ్మును రాబట్టాడు. ఈ స్కీంలో భాగంగా కస్టమర్ల చేత రూ.8 లక్షలకు రెండు గుంటల భూమి కొనుగోలు చేయించారు పవన్ అండ్ కో. ప్రతినెలా నాలుగు శాతం లాభం ఇస్తామంటూ ఒప్పందం చేసుకున్నారు కేటుగాళ్లు.
కొన్ని నెలలు బాగానే సాగింది యవ్వారం.. క్రమం తప్పకుండా కొన్ని నెలలు లాభాలు ఇచ్చి ఆపై మొహం చాటేశారు కేటుగాళ్లు. అంతే కాకుండా డబల్ గోల్డ్ స్కీం, గోల్డ్ చిట్స్ స్కీం కింద కస్టమర్ల దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేశారు కేటుగాళ్లు. కొన్నాళ్ల తర్వాత లాభాలు ఇవ్వకపోవడం, పవన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పవన్ ను, అతడికి సహకరించిన మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.