ఇచ్చిన లక్ష అప్పు.. తిరిగి అడిగితే హత్య : మంజులను చంపింది రిజ్వానా బేగం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ మంజుల హత్య కేసులో అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు. మంజుల మృతికి డబ్బే కారణమని పోలీసులు తేల్చారు. మంజుల హత్యకు కుట్ర పన్నిన ఓ మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజాలు భయటపడటంతో అందరూ షాక్ అయ్యారు.

ఈ కేసులో ప్రధాన నిందితురాలు రిజ్వానా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజుల ఇంటి సమీపంలో రిజ్వానా లేడీస్ ఎంపోరియం నడుపుతోంది. ఈ క్రమంలో రిజ్వానాకు మంజుల లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఇచ్చిన అప్పు రెండు నెలలైనా చెల్లించకపోవడంతో.. తిరిగి ఆ డబ్బును ఇవ్వాలని పలుమార్లు రిజ్వానాను మంజుల, ఆమె భర్త నిలదీశారు. అయితే గత రెండు నెలలుగా రిజ్వానా వడ్డీకూడా చెల్లించలేదు. దీంతో రిజ్వానా ఇంటికి వెళ్లిన మంజుల, భర్త లక్ష్మయ్య ఆమెతో గొడవపడ్డారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు.  

దీంతో రిజ్వానాకు కోపం వచ్చి  2023 ఆగస్టు 10వ తేదీన అర్థరాత్రి మంజులను హత్య చేసింది. మంజులను హత్య చేయడానికి ముందు రిజ్వానా ఆమె కళ్లలో కారం కొట్టి.. దాడి చేసింది. ఆ తర్వాత మంజుల చీర కొంగునే ఆమె మెడకు గట్టిగా కట్టి.. ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత పెట్రోల్ తో మంజుల మృతదేహాన్ని రిజ్వానా కాల్చివేసింది. మంజుల చనిపోయిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారం, చెవుల రింగ్స్ ను రిజ్వానా ఎత్తుకెళ్లింది. మంజుల నగలను ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టింది. 

అయితే హత్య జరిగిన రోజు రిజ్వానా తన భర్తతో కలసి అజ్మీర్ దర్గాకు వెళ్లినట్లు టికెట్స్ బుక్ చేసింది. అయితే పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ క్రమంలో మంజుల హత్యకు కారణమైన ప్రధాన నిందితురాలు రిజ్వానాను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.