ముషీరాబాద్, వెలుగు: వెహికల్స్ స్పేర్ పార్ట్స్ దొంగలిస్తున్న ఇద్దరిని, వాటిని కొంటున్న మరో ముగ్గురిని ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి స్పేర్ పార్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పీఎస్లో గురువారం సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ వివరాలు వెల్లడించారు. ఖాజా హుస్సేన్ (31) యూసుఫ్ పాషా (42) పార్క్ చేసిన వెహికల్స్ నుంచి స్పేర్ పార్ట్స్ తీసి అమ్ముతున్నారు. బోలక్ పూర్ ఇంద్ర నగర్ లోని అబ్దుల్ ముజీబ్ కు చెందిన బైక్ పార్సిగుట్టలో చోరీ గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ కేసు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. ఖాజా హుస్సేన్, యూసుఫ్ బైక్ ను దొంగతనం చేసినట్టు తెలిపారు. వారిని విచారించగా.. అసలు విషయం ఒప్పుకున్నారు. దీంతో దొంగలను, సామాన్లు కొన్న వారిని అరెస్టు చేసి ఎలక్ట్రానిక్ కట్టర్స్, స్పేర్ పార్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ ఆనంద్ కుమార్, ఏసీపీ రమేశ్ కుమార్, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ రాంబాబు, డీఐ ఎండీ నదీమ్ హుస్సేన్, ఎస్సై చలపతి రెడ్డి పాల్గొన్నారు.