ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

జాబుల పేరుతో జేబులు లూటీ
ఫేక్ జాబ్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

కాజీపేట, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి, రూ.లక్షల్లో వసూలు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ జితేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఏపీలోని  శ్రీకాకుళం జిల్లాకు చెందిన సలాడి రామ్ గోపాల్, కాకినాడకు చెందిన అంకాల సుభాష్, విజయవాడకు చెందిన రజనితో పాటు హైదరాబాద్ కు చెందిన ధర్మవరం ప్రసాద్  ముఠాగా ఏర్పడ్డారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయంటూ.. వివిధ పేపర్లు, సోషల్ మీడియాలో ప్రకటనలు వేసేవారు. ఎలాంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండానే సర్కారు కొలువులు ఇప్పిస్తామని నమ్మించి, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్లు సృష్టించి బురిడీ కొట్టించేవారు.

ఈ క్రమంలో ఈనెల 4న వరంగల్ మట్టెవాడకు చెందిన ఓ నిరుద్యోగి నుంచి నగదు వసూలు చేసి, ఫేక్ అపాయింట్​మెంట్ లెటర్ ఇచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ముఠాపై నిఘా పెట్టారు. సుబేదారికి చెందిన మరో నిరుద్యోగి నుంచి నగదు వసూలు చేసి, ఈ ముఠా శుక్రవారం సిటీకి వచ్చింది. శనివారం తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తుండగా.. ఎంజీఎం సర్కిల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష క్యాష్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్లు వెంకటేశ్, నరేశ్​కుమార్, ఎస్ఐ నిసార్ పాషా, సిబ్బంది సోమలింగం, మాధవ రెడ్డి, స్వర్ణలత,  శ్రీనివాస్, అలీ, రాజేష్, బిక్షపతి, రాజు, శ్రవణ్ కుమార్ లను ఏసీపీ అభినందించారు.

ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి

వెంకటాపూర్, ములుగు, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు జాడీ రామరాజు నేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు కూడా కలిసి రావాలని కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ గా మారడానికి అన్ని అవకాశాలు ఉన్నా.. కొంత మంది లీడర్ల వల్ల అది నెరవేరడం లేదన్నారు. మండలాలు, జనాభా, రెవెన్యూ గ్రామాల పరంగా ఏటూరునాగారం డివిజన్ కేంద్రం కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. తెలంగాణ రెవెన్యూ చట్ట ప్రకారం ఏజెన్సీ ఏరియాలో  రెవెన్యూ  డివిజన్ 50 కిలోమీటర్ల పరిధి దాటకూడదని, కానీ ఎటుచూసినా ఏటూరునాగారం 50 కిలోమీటర్లకు మించి ఉందన్నారు.

రామప్ప అద్భుత కట్టడం

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: రామప్ప అద్భుత కట్టడమని, కాకతీయుల శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఉందని హైకోర్టు జడ్జి మాధవి దేవి అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్పను శనివారం ఆమె కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వారిని పట్టు వస్త్రాలతో సత్కరించారు. గైడ్ ద్వారా రామప్ప విశిష్టతను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ములుగు జడ్జి సౌఖ్య, సీఐ రంజిత్, వెంకటాపూర్ ఎస్సై తాజుద్దీన్ తదితరులున్నారు.

గుర్రం వెంకటేశ్వర్లుకు నివాళి

వెంకటాపురం, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలకేంద్రంలో శనివారం గుర్రం వెంకటేశ్వర్లు స్తూపానికి సీపీఎం నాయకులు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఆవరణలో 12వ వర్ధంతి సభ నిర్వహించగా..  ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటేశ్వర్లు మాట్లాడారు. గుర్రం వెంకటేశ్వర్లు గిరిజన, బడుగు, బలహీన వర్గాలను సంఘటితం చేసి, వారిని ఉద్యమ దారిలో నడిపించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి, పేదలకు అండగా నిలబడ్డారన్నారు. 2010లో గుండెపోటుతో ఆయన మరణిస్తే.. ఆయన తమ్ముడు గుర్రం పుల్లారావు.. వెంకటేశ్వర్లు ఆశయ సాధనకు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సీపీఎం మండల కార్యదర్శి కుమ్మరి శీను, జిల్లా నాయకులు దబ్బకట్ల లక్ష్మయ్య, జ్ఞానం శ్రీనివాస్, దావూద్, వంక రాములు తదితరులున్నారు.

పోడు భూముల వివరాలు  పక్కాగా నమోదు చేయాలి

కొత్తగూడ, వెలుగు: జిల్లాలోని పోడు భూములను పక్కాగా సర్వే చేసి, వివరాలు నమోదు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్​ శశాంక ఆఫీసర్లను ఆదేశించారు. ఆన్ లైన్ లో అప్లై చేసుకున్ని ప్రతి పోడు రైతు భూమిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. శనివారం ఆయన కొత్తగూడ, గూడూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పోడు భూముల సర్వేను పరిశీలించారు. ఎఫ్ఆర్సీ కమిటీలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అర్హుల పరిశీలన జరగాలన్నారు. అటవీ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో పనిచేయాలని, ఇరు శాఖల రికార్డులు సరిచూసుకోవాలని చెప్పారు. పరిష్కారం కాని వాటిని తన దృష్టికి తీసుకురావాలన్నారు. సర్వే సమయంలో అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, వివరాలు నమోదు చేయాలన్నారు. ఆయన వెంట డీటీడీవో మంకిడి ఎర్రయ్య, తహసీల్దార్లు, ఎఫ్ఆర్వోలు, ఎంపీవోలు ఉన్నారు.

యువతకు ఆదర్శం నర్సయ్య సార్

రఘునాథపల్లి, వెలుగు: నేటి యువతకు నర్సయ్య సార్ ఆదర్శమని పలువురు వక్తలు కొనియాడారు. ఇటీవల ప్రముఖ జాతీయవాది, కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్ గుజ్జుల నర్సయ్య మృతి చెందగా.. శనివారం ఆయన స్వగ్రామమైన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెం గ్రామంలో సంస్మరణ సభ నిర్వహించారు. నర్సయ్య సార్ కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొని నివాళి అర్పించారు. సర్సయ్య సార్ గ్రామానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఉపన్యాసాలు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉత్తెపు ఉమారాణి సత్యనారాయణ, ఉప సర్పంచ్ వేణు, గ్రామస్తులు హాజరయ్యారు.

వాల్మీకి బోయలను  ఎస్టీలో చేర్చాలి
వాల్మీకి జయంతిని ఈసారి బహిష్కరిస్తున్నం

కాశిబుగ్గ, వెలుగు: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చనందుకు గాను ఈ ఏడాది ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వాల్మీకి జయంతి బహిష్కరిస్తున్నట్లు ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పెనుకుల సాంబశివరాజు వెల్లడించారు. శనివారం వరంగల్ సిటీలోని ఏనుమాముల శివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ బోయలను, ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పి, మోసం చేశారన్నారు. ఆదివారం నిర్వహించే వాల్మీకి జయంతిని రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రవీందర్, ఐలయ్య, కుమారస్వామి, రమేశ్, రాజు, రామచంద్రం, మొగిళి, రవి, మల్లయ్య, సమ్మయ్య, శ్రావణ్, నాగరాజు తదితరులున్నారు.

ప్రగతి నివేదికలు తయారు చేయాలి

జనగామ అర్బన్, వెలుగు: పంచాయతీ అవార్డుల కోసం జాతీయ బృందం జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటించనుందని, ఈమేరకు ప్రగతి నివేదికలను రెడీ చేయాలని జనగామ అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హామీద్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో సంబంధిత జిల్లా ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ సిబ్బంది, ఎంపీవోలతో మీటింగ్ నిర్వహించారు. అన్ని వివరాలు సిబ్బంది పక్కాగా నమోదు చేయాలన్నారు. అత్యధిక గ్రామాలకు అవార్డులు దక్కేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఇన్ చార్జి సీఈవో  వసంత, డీఆర్డీఏ పీడీ రాంరెడ్డి, డీఎంహెచ్​వో మహేందర్, డీపీవో రంగాచారి, డీఎస్​వో రోజారాణి తదితరులున్నారు.

ఇండ్ల కూల్చివేతలో వాగ్వాదం

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో వరంగల్–ఖమ్మం హైవే వెడల్పులో భాగంగా చేపట్టిన ఇండ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. శనివారం పోలీసులు, ఆఫీసర్లు భారీ బందోబస్తు మధ్య జేసీబీలు, హిటాచీలతో పలు ఇండ్లు కూల్చివేయగా.. బాధితులు అడ్డుచెప్పారు. మార్కింగ్ కంటే ఎక్కువగా కూల్చేస్తున్నారని ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. అధికారులు కొంతమంది ఇండ్లను కూల్చివేయకుండా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని తెలిపారు.

ఘనంగా మిలాద్ ఉన్ నబీ


మహ్మద్ ప్రవక్త జన్మదినమైన ‘మిలాద్ ఉన్ నబీ’ని శనివారం ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. పలువురు సేవా కార్యక్రమాలు చేపట్టారు. జనగామలో మూమిన్ యూత్​ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘బ్లడ్ డొనేషన్’ నిర్వహించారు. యువకులు, మైనార్టీ నాయకులు రక్త దానం చేశారు. - జనగామ అర్బన్, వెలుగు

మహాదీక్షకు తరలిన హిందూ సంఘాలు

జనగామ అర్బన్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన మహాదీక్షకు జనగామ జిల్లా హిందూ సంఘాలు తరలివెళ్లాయి. శనివారం జనగామ చౌరస్తాలో అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేసి, రాజధానికి తరలివెళ్లారు. వీహెచ్​పీ జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. రాజాసింగ్ పై పీడీయాక్ట్ ఎత్తివేసి, వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గునిగంటి రామక్రిష్ణ, బచ్చు బాలనారాయణ, పులిగిల్ల ఉపేందర్, కూరోజు సదానంద చారి, రవీందర్, ముక్క స్వామి, దడిగె జంపన్న, గుజ్జుల కుమారస్వామి తదితరులున్నారు.

ములుగులో వీఆర్ఏల రాస్తారోకో

ములుగు, వెలుగు: వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏల జేఏసీ జిల్లా చైర్మన్ పాండవుల మహేందర్ డిమాండ్ చేశారు. ఈమేరకు ములుగులో శనివారం రాస్తారోకో చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పేస్కేల్ అమలు చేయాలన్నారు. అర్హులైన వారికి ప్రమోషన్లు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. 70రోజులుగా దీక్షలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో జేఏసీ కో–కన్వీనర్ కాసర్ల రాజు, నాయకులు తిరుపతి, రాజు, మండల అధ్యక్షులు నన్నెబోయిన సురేశ్​తదితరులున్నారు.

సర్పంచ్ పై అట్రాసిటీ కేసు పెట్టాలి

నల్లబెల్లి, వెలుగు: దళిత వ్యక్తిపై దాడిచేసిన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుల్లపాడు సర్పంచ్ పై కేసు నమోదు చేయాలని దళిత, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈమేరకు శనివారం నల్లబెల్లి మండలకేంద్రంలో ఆయా సంఘాల నాయకులు ధర్నా చేశారు. దసరా రోజు డప్పు కొట్టడానికి ఆలస్యంగా వస్తావా? అంటూ సర్పంచ్ సదరు వ్యక్తిపై దాడికి పాల్పడడం హేయమైన చర్యన్నారు. పోలీసులు పూర్తిస్తాయి విచారణ జరిపి, సర్పంచ్​ని అరెస్టు చేయాలని కోరారు.

వృద్ధురాలిపై కోతుల దాడి

కమలాపూర్, వెలుగు: వృద్ధురాలిపై కోతులు దాడి చేసిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తిప్పారపు లింగాభాయ్ అనే వృద్ధురాలు శనివారం ఉదయం తన ఇంటి ఆవరణలో బియ్యం చెరుగుతోంది. ఒక్కసారిగా కోతుల గుంపు ఆమెపై పడ్డాయి. విచక్షణారహితంగా దాడి చేశాయి. చుట్టుపక్కల వారు గమనించి, ఆమెను స్థానిక పీహెచ్ సీకి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. అయితే గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, తరచూ దాడి చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.