కంటోన్మెంట్, వెలుగు: వందకు పైగా ఇండ్లలో చోరీలు చేసిన ఘరానా దొంగను కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్అవేజ్అహ్మద్ (42) ఈజీమనీ కోసం చోరీలు మొదలుపెట్టాడు. తొలుత తాళం వేసిన ఇండ్ల వద్ద రెక్కీ నిర్వహించి లోపలికి ప్రవేశిస్తాడు. బీరువాలోని నగలు, నగదు దోచుకుని పారిపోతాడు. దొంగిలించిన సొత్తును తన స్నేహితుడు సలామ్‌బిన్ అలీ తిమిమితో వద్ద దాచిపెట్టి, అవసరమైనప్పుడు అమ్మి జల్సాలు చేస్తాడు.
అహ్మద్‌ను 2016లో మేడిపల్లి పోలీసులు, 2021లో కూకట్పల్లి పోలీసులు పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపినా ప్రవర్తనలో మార్పు రాలేదు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 21, రాచకొండలో 49, సైబరాబాద్‌లో 37 చోరీలు చేశాడు. తన స్నేహితుడితో కలిసి గత నెల 29న కొండాపూర్ ఏరియాలో, ఈ నెల 3న టోలీచౌకీలో దొంగతనాలు చేశాడు. ఈ నెల10న కార్ఖానా జవహర్ రైల్వేకాలనీలోని ఇంట్లో చోరీకి పాల్పడి నగదు, నగలు దోపిడీ చేసి పారిపోయాడు.
దీనిపై బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీని పరిశీలించి అహ్మద్‌ను అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.10 లక్షల బంగారం, వెండి నగలు, రూ.5 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు తిరుమల గిరి ఏసీపీ రమేశ్, కార్ఖానా సీఐ రామకృష్ణ తెలిపారు.