ఫేక్ డాక్యుమెంట్లతో రూ.1.37 కోట్లు స్వాహా

ఫేక్ డాక్యుమెంట్లతో రూ.1.37 కోట్లు స్వాహా

కరీంనగర్/కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్​లోని ఓ ల్యాండ్​కు సంబంధించిన ఫేక్​డాక్యుమెంట్లు చూపించి, రూ.1.37 కోట్లు కాజేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్​చేశారు. వారిలో 17వ డివిజన్ కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి భర్త ప్రశాంత్,18వ డివిజన్ కార్పొరేటర్ భర్త సుధగోని మాధవి భర్త కృష్ణగౌడ్​తోపాటు ఏలేటి భరత్ రెడ్డి ఉన్నారు.  పోలీసుల కథనం ప్రకారం.. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శివసాయి నగర్ కు చెందిన గునుకుల రాజిరెడ్డికి 2014లో సుధగోని కృష్ణగౌడ్​ పరిచయమయ్యాడు.

ఈ క్రమంలో రేకుర్తి శివారులో 25 గుంటల భూమి అమ్మకానికి ఉందని, భవిష్యత్ లో మంచి రేటుకు పోతుందని కృష్ణ గౌడ్ రాజిరెడ్డిని నమ్మించాడు. సదరు భూమిని కొనేందుకు రాజిరెడ్డి ఓకే చెప్పడంతో కృష్ణ గౌడ్, జక్కుల మల్లేశం కలిసి గుంటకు రూ.6 లక్షల చొప్పున అగ్రిమెంట్ చేసుకున్నారు. అడ్వాన్సుగా రాజిరెడ్డి రూ.31 లక్షలు ముట్టజెప్పాడు. తర్వాత హద్దులు పాతేందుకు వెళ్లగా, సదరు భూమి తమదని కొందరు గొడవకు దిగారు. రాజిరెడ్డి విషయాన్ని కృష్ణగౌడ్​కు చెప్పగా ఆ భూమికి బదులు, సర్వే నంబర్ 79/B లో 20 గుంటల భూమి అమ్మకానికి ఉందని, అయితే గుంటకు 9 లక్షలు అవుతుందని నమ్మబలికాడు. విడతల వారీగా  రూ.76 లక్షలు తీసుకున్నాడు. తర్వాత భూమి రిజిస్ట్రేషన్ చేయాలని రాజిరెడ్డి కోరగా కంకణాల భాగ్యలక్ష్మి, కంకణాల సుజాత పేరిట ఉన్న 700 చదరపు గజాలను రాజిరెడ్డి తమ్ముడైన సంపత్ కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు.

తర్వాత వడ్డేపల్లి కరుణాదేవి పేరిట ఉన్న మరో 1,210 చదరపు గజాల భూమిని సంపత్ కుమార్ పేరిట 2017లో రిజిస్ట్రేషన్ చేయించాడు. సదరు భూములకు సంబంధించిన లింకు డాక్యుమెంట్లు కావాలని కృష్ణగౌడ్​ను అడగగా గజ్జల స్వామి పేరుపై 2006 జనవరి రెండో తేదీన జీపీఏ చేసిన డాక్యుమెంట్ ఇచ్చాడు. ఆ డాక్యుమెంట్ ను పరిశీలించగా అది వివాదాల్లో ఉన్న భూమి అని తెలిసింది. తీసుకున్న డబ్బులకు భూమి రిజిస్ట్రేషన్ చేయించాలని కోరగా కృష్ణగౌడ్, కార్పొరేటర్ భర్త కోల ప్రశాంత్​ను పరిచయం చేశాడు. భూ సమస్యను పరిష్కరిస్తామని నమ్మించి ఇద్దరూ మరో రూ.50 లక్షలు వసూలు చేశారు.