- పీర్జాదిగూడలో కలకలం రేపిన పసికందు అమ్మకం
- ఆర్ఎంపీతో మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
మేడిపల్లి, వెలుగు : మూడు నెలల పసిబిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటన పీర్జాదిగూడలో కలకలం రేపింది. పసి బిడ్డలను అమ్మే ముఠాలోని సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడిపల్లి పోలీసులు తెలిపిన ప్రకారం.. పీర్జాదిగూడ కార్పొరేషన్ రామకృష్ణనగర్ కాలనీలో ఉండే ఐతె శోభారాణి (48) స్థానికంగా ఆర్ఎంపీ. ఆమెతో పాటు అదే కాలనీకి చెందిన షేక్ సలీం పాషా, ఉప్పల్ ఆదర్శనగర్ కాలనీకి చెందిన చింత స్వప్న కలిసి కొన్నాళ్లుగా పసిబిడ్డలను అమ్మకం చేస్తున్నారు.
ఇందుకు విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని పేద కుటుంబాల పిల్లల ఆచూకీని తెలుసుకుని వెళ్లి డబ్బులు ఆశచూపించి తీసుకొస్తారు. పిల్లలు లేనివారికి అమ్మి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటున్నారు. స్థానిక స్వచ్ఛంద సభ్యులు కొందరు ప్లాన్ చేసి, తమకు ఆడపిల్ల కావాలని ఆర్ఎంపీ శోభారాణిని సంప్రదించారు. 3 నెలల పసికందును రూ.4,50 లక్షలకు బేరం కుదుర్చుకుని, రూ.10వేలు అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు పాపను ఇచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు.
బుధవారం మధ్యాహ్నం చిన్నారిని తీసుకెళ్లడానికి స్వచ్ఛంద సంస్థ సభ్యులు వెళ్లగా.. అప్పటికే విజయవాడ నుంచి తీసుకొచ్చిన పాపను చూపించారు. దీంతో స్వచ్ఛంద సంస్థ సభ్యులు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పసిబిడ్డను అమ్మకానికి పెట్టిన శోభారాణి, స్వప్న, సలీంను అదుపులోకి తీసుకుని, చిన్నారిని అమీర్ పేటలోని శిశువిహార్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.