గోవా నుంచి వరంగల్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువకులు

వరంగల్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. కొకైన్ తో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలు యధేచ్చగా జరుగుతున్నాయని గుర్తించారు పోలీసులు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు.. కొకైన్ తో పాటు ఆరు రకాల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.  కొకైన్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. అలాగే.. మత్తు పదార్థాలు తీసుకుంటున్న నలుగురు యువకులను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 3 లక్షల 16వేల రూపాయల విలువైన ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 ఎల్.ఎస్.డి పేవర్లు, మత్తు కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయి నుండి తీసిన నూనే, గంజాయి పోడి చేసే పరికరం, ఒక హుక్కా పాట్.. అందులో వాడే సామగ్రి  స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ కు చెందిన బీటెక్ విద్యార్థి రోహన్, హైదరాబాద్ కు చెందిన పెంచికల కాశీరావును పోలీసులు అరెస్ట్ చేశారు. రోహన్ తరుచు గోవా వెళ్లి నైజీరియా దేశస్తులైన జాక్, కాల్ జాఫర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నట్టు గుర్తించారు. గోవా నుంచి తీసుకొచ్చి వరంగల్ లో అమ్ముతున్నట్టు పోలీసులు చెప్పారు.