ఆర్మూర్/కామారెడ్డి, వెలుగు : ఆర్మూర్ టౌన్ లో బంగారు ఆభరణాలు తయారు చేసే అంజన్ భునియా ఇంట్లో పది రోజుల కిందట దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రూ.9లక్షల విలువైన 180 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. మంగళవారం స్థానిక పీఎస్‌లో మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. డిసెంబర్ అర్ధరాత్రి తర్వాత మహారాష్ట్ర కు చెందిన దీపేశ్రాంకేష్ గుప్తా, మాలియామాజి, మరో బాలుడు చోరీ చేశారు. ఆ సొత్తు తో పారిపోయేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్ళగా ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో సీఐ సురేశ్‌బాబు, ఎస్ఐ రాము, ఎఎస్ఐ గఫార్, కానిస్టేబుల్ గంగాప్రసాద్, ప్రసాద్ ల బృందం దీపేశ్ రాంకేశ్ గుప్తా, ఓ మైనర్‌ను పట్టుకున్నారు. మాలియామాజీ పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న దొంగ కోసం గాలిస్తున్నట్లు సీపీ తెలిపారు.
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలి: సీపీ
బాల్కొండ: జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని సీపీ నాగరాజు అన్నారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న పోలీస్ భవనాన్ని మంగళవారం ఆయన పరిశీలించి, మీడియా తో మాట్లాడారు. యువత డ్రగ్స్ కు బానిస అవొద్దని సూచించారు. పోలీసు సిబ్బంది ప్రజలతో ఫ్రెండ్లీ గా ఉండాలన్నారు.
కామారెడ్డిలో..
కామారెడ్డి టౌన్ పోలీసులు మంగళవారం ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి. శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వీరి నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారం వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన ప్రకారం... బాన్సువాడకు చెందిన ఎల్లప్ప అలియాస్ ఒల్లెపు కాశీనాథ్ ప్రస్తుతం కామారెడ్డి లోని బతుకమ్మ కుంటలో ఉంటున్నాడు. ఇతను గతంలో పలు జిల్లాల్లో 28 దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. కామారెడ్డి ఇందిరానగర్ కాలనీకి చెందిన ఉప్పు రాములు కలిసి మళ్లీ ఇటీవల దొంగతనాలు చేశారు. కామారెడ్డి టౌన్, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. మంగళవారం రామారెడ్డి రోడ్డులో పోలీసులు వెహికల్స్ తనిఖీ చేస్తుండగా కాశీనాథ్ అనుమానస్పదంగా కనిపించడంతో పట్టుకొని ఎంక్వైరీ చేయగా దొంగతనాలు చేసిన విషయం ఒప్పుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, 2.20 లక్షల నగదు, 4 తులాల బంగారు ఆభరణాలు వస్తువులు, 2 టీవీలు, హోం థియేటర్ స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ మొత్తం రూ.5 లక్షలు ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. ఏఏస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం, టౌన్ సీఐ నరేశ్, సీసీఎస్ సీఐ మల్లేశ్‌గౌడ్, ఎస్సైలు రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.
గుంట భూమి కూడా పోదు : గంప గోవర్ధన్
మాస్టర్ ప్లాన్‌తో రైతులది గుంట భూమి కూడా పోదని ఎమ్మెల్యే గంప వర్ధన్ పేర్కొన్నారు. రైతులు, పేదల సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. దోమకొండ, బీబీపేట మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ..మాస్టర్ ప్లాన్‌పై వచ్చిన అభ్యంతరాలపై తాము మొండీగా తీర్మానం చేసి పంపితే రైతులను మోస గించిన వారమవుతామన్నారు. కానీ, తాము రైతుల పక్షాన తాము ఉంటా మన్నారు. డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్‌పైనే రాజకీ య పబ్బం గడ్పుకోవటానికి కొందరు రైతలను ఇబ్బందులకు గురి చేస్తున్నార న్నారు. ఇంత నీచమైమైన, విష రాజకీయం ఉంటదా అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ చెప్పుకొవాలి, రాష్ర్ట ప్రభుత్వం ఏం చేసిం దో మేం చెప్పుకుంటాం అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో 2 సార్లు మంత్రిగా పని చేసిన షబ్బీర్అలీకి డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్ అంటే తెలియదా? అని ప్రశ్నించారు. షబ్బీర్‌అలీ దిగజారుడు రాజకీయాలు చే యటం ఎంతవరకు సమంజసమన్నారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
నిజామాబాద్‌రూరల్, వెలుగు: మన ఊరు మన బడి పనుల్లో నాణ్యత పాటించాలని డీఆర్డీఓ అడిషనల్ పీడీ సంజీవ్ కుమార్ సూచించారు. మోపాల్ మండలంలోని సింగంపల్లి, బాడ్సి, నర్సింగ్‌పల్లి, ముదక్ పల్లి గ్రామాల్లో మంగళవారం పనులను తనిఖీ చేశారు. మండలస్థాయి అధికారులు, పాఠశాల సిబ్బందితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి మన ఊరు మన బడిని విజయవంతం చేయాలని కోరారు. ఆయనతో పాటు సింగంపల్లి సర్పంచి గంగాధర్, ఎంపీడీవో లింగం, కార్యదర్శి నవీన్ పాల్గొన్నారు.
12,700 గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు పూర్తి
-
పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంత్ రావు
నస్రుల్లాబాద్, వెలుగు: రాష్ర్టంలో 12,700 గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులు పూర్తయ్యాయని పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంత్ రావు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో కమిషనర్ హన్మంత్ రావు, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పల్లె ప్రగతి లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. నస్రుల్లాబాద్‌లో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు, ఇతర పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పల్లెల్లో సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఉండేవని, పల్లె ప్రగతి పనుల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. హరితహారంలో భాగంగా గ్రామాలలో ఉన్నట్టు మొక్కలు ఏపుగా పెరగడంతో పల్లెలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయని చెప్పారు. అనంతరం మండలంలోని బొప్పాస్ పల్లి గ్రామంలోని ఆయిల్ పామ్ పంటను పరిశీలించారు, ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ రాజా గౌడ్, సర్పంచ్ అరిగే సాయిలు, జడ్పీ సీఈవో, సాయ గౌడ్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఎంపీపీ విఠల్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ మెంబర్ మజీద్, సెక్రెటరీ రాజేశ్, మాజీ ఎంపీటీసీ కంది మల్లేశ్ పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలి
ధర్పల్లి, వెలుగు: ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలని, ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని ఎంపీపీ సారిక హన్మంత్‌రెడ్డి, ధర్పల్లి వ్యవసాయాధికారి ప్రవీణ్కుమార్అన్నారు. మండలంలోని చల్గగర్గ గ్రామంలో ఆయిల్ పామ్ సాగును మంగళవారం వారు పరిశీలించారు. ఇందులో అంతర పంటల సాగుకు ప్రభుత్వం ఎకరాకు రూ. 2100 ఇస్తున్నట్టు చెప్పారు. వారితో పాటు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్ యాదవ్, సింగిల్‌విండో చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, వెలుగు: పట్టణంలోని వినాయకనగర్ లో ఉన్న ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. లీడర్ల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. మరమ్మతు పనులను రెండుమూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, పంచాయతీ రాజ్ ఈఈ శంకర్ పాల్గొన్నారు.
కంపెనీ వీసాలని విజిటింగ్ వీసాలు
- జిల్లా వాసులను మోసం చేస్తున్న ఏజెంట్లు
- గల్ఫ్‌లో చిక్కుకుంటున్న స్థానికులు
నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న కామారెడ్డి జిల్లాలో జరిగిన మలేషియా బాధితుల ఘటన మరువక ముందే.. మంగళవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన కొంత మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విదేశాల్లో పని ఉందని, స్థానిక యువకులను మోటివేట్ చేసి గల్ఫ్ వెళ్లేలా చేస్తున్నారు. అలా ఇటీవల కాలంలో ఏజెంట్లు రూ. 3.5 కోట్లు బాధితుల నుంచి దండుకున్నారు. ఏజెంట్లను నమ్మి డబ్బులు కట్టిన 250 మంది విజిటింగ్ విసాలతో దుబాయ్ వెళ్లగా అక్కడ అసలు విషయం తెలిసింది.
కంపెనీ వీసా పేరితో..
జిల్లా నుంచి 250 మంది యువకులు దుబాయ్ లోని ఓ కంపెనీలో జాబ్స్ కోసం ఏజెంట్ చిక్కెల స్వామికి రూ. 70వేల నుంచి నుండి 1.30 దాకా లక్షలు చెల్లించినట్టు తెలిపారు. కంపెనీలో నెలకు రూ. 25000 జీతం అని నమ్మించి, డబ్బులు కట్టించుకున్నాడని చెప్పారు. వీళ్లంతా నవంబర్ 5 వరకు దుబాయ్ వెళ్లారు. అక్కడి వెళ్లాక విజిటింగ్ వీసాలతో వచ్చినట్టు తెలుసుకుని, గల్ఫ్ సంక్షేమ సంఘాల ప్రతినిధులను ఆశ్రయించారు. వారి సాయంతో డిసెంబర్ 20న ఇండియాకు వచ్చారు. ఇలా ప్రతి రోజూ ఏజెంట్లు పలు మోసాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమాయకులను ఆసరాగా చేసుకొని, లక్షల్లో వసూలు చేసి దుబాయ్, అబుదాబి, మస్కట్, సౌదీ వంటి గల్ఫ్ దేశాలతో పాటు మలేషియాకు పంపుతున్నారు.
ఫైన్ పడుతుందని వచ్చేశాం
వీసా గడువు ముగిశాక డైలీ రూ. 10 వేల ఫైన్ పడ్తుందని ఇండియాకు వచ్చేశాం. 20 రోజుల పాటు హోటల్ గదిలోనే ఉంచిన్రు. ఏజెంట్ మోసం తెలిశాక బయటకి వచ్చాం. తెలుగువారి సహాయంతో ఇండియాకి వచ్చేశాం. దుబాయ్ లో క్యాటరింగ్ జాబ్ కి రూ. 1.10 లక్షలు ఇచ్చి మోసపోయాం.
–రాజు మోకన్ పల్లి
మాయమాటలతో మోసగించిండు
క్యాటరింగ్ కంపెనీలో ఫుడ్ ప్యాకింగ్ జాబ్ లో నెలకు రూ.25 శాలరీ అని మోసగించిండు. అక్కడ వెళ్లిన రోజే ఏజెంట్ మోసం తెలిసింది. విజిట్ వీసాలతోనే అందరిని పంపిండు. జిల్లా నుంచి వెళ్లిన తాము కొందరి సాయంతో తిరిగి వచ్చాం. వీసా కోసం చెల్లించిన రూ. 1.10 లక్షల ప్రభుత్వం ఇప్పించాలె.
–కళ్లెం శ్రీను, ధర్మోర
అరటన్ను పీడీఎస్ రైస్ పట్టివేత
బోధన్,వెలుగు: బోధన్ మండలంలోని జాడిజామాల్పూర్ వద్ద టాస్క్‌ఫోర్స్, బోధన్ రూరల్ పోలీసులు 500 క్వింటాళ్ల పీడీయస్ రైస్‌ను పట్టుకున్నట్లు ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం బోధన్ రూరల్ సీఐ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మహారాష్ట్ర నుంచి బోధన్ వైపు పీడీయస్ రైస్‌ను తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడి చేశారు. మండలంలోని జాడిజమాల్‌పూర్ వద్ద మహారాష్ట్ర నుంచి వస్తున్న రెండు లారీలు పట్టుకున్నారు. రైస్ విలువ రూ.16లక్షలు ఉంటుందని తెలిపారు. లారీలను బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్లు ఎండీ కలీమ్, తుపాకర్ రాజరామ్, క్లీనర్ మహమ్మద్ ఇక్బాల్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే పట్టుకున్న రెండు లారీలను సీజ్ చేసి సివిల్ సప్లయ్ ఆఫీసుకు పంపించనున్నట్లు తెలిపారు. లారీలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీధర్, బోధన్ రూరల్ సీఐ శ్రీనివాస్‌రాజ్ ను ఏసీపీ అభినందించారు.
భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య
- 20 రోజుల్లోనే ఇద్దరు మృతి అనాథలైన పిల్లలు
కామారెడ్డి, వెలుగు: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ భార్య భర్తలు 20 రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. భర్త బావిలో పడి చనిపోగా, అతడి ఎడబాటును భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రానికి చెందిన మొత్తల ఆశోక్, భార్గవి ఐదేండ్ల క్రితం ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరికి ధన్విక( 3), అద్వైత్( 2) పిల్లలు. ఆశోక్ మేస్త్రీ పనితో పాటు వ్యవసాయం కూడా చేసేవాడు. 20 రోజుల క్రితం పశువులకు నీళ్లు పెట్టడానికి తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదావశాత్తు బావిలో పడి చనిపోయారు. అప్పటి నుంచి భార్గవి భర్తను మరిచిపోలేకపోతోంది. భర్త మరణాన్ని తట్టుకొలేకపోయిన ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు.
విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన
- ఎంఈఓకు ఫిర్యాదు..
ఎర్గట్ల,వెలుగు: ఎర్గట్ల మండల కేంద్రంలోని జడ్పీ హెచ్ఎస్ హైస్కూల్ లో మ్యాథ్స్ టీచర్ పోతు రాజేందర్..స్టూడెంట్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, అతని పై పేరెంట్స్, స్టూడెంట్లు సోమవారం ఎంఈ ఓ ఆంధ్రయ్యకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంఈఓ ఆంధ్రయ్య స్కూల్‌ను విజిట్ చేశారు. టీచర్ తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, అనవసరంగా పిలిచి ఇబ్బంది పెడుతున్నాని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. 2015 నుంచి స్కూల్లో మాథ్స్ టీచర్ గా పని చేస్తున్న రాజేందర్ గురించి చాలా సందర్భాల్లో హెచ్ఎంకు చెప్పినా.. తీరు మారలేదని లేదని ఎంఈఓకు పేరెంట్స్ తెలిపారు. ఎంఈఓ మాట్లాడుతూ..స్టూడెంట్లు, పేరెంట్స్, సర్పంచ్ ఫిర్యాదుతో విచారణ చేసి నివేదికను డీఈఓకు అందిస్తామన్నారు.
సీసీ కెమెరాలు ధ్వంసం చేసి రెండు ఆలయాల్లో చోరీ
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఆలయాల్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దొంగలు చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ శివారులోని శుక్రవారం దేవి ఆలయంలో, సమీపంలోని చేపూర్ గ్రామ రోడ్డు పై ఉన్న సాయిబాబా ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయాల్లో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన దొంగలు గేటు తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. సాయిబాబా మందిరంలో హుండీ పగులగొట్టారు. శుక్రవారం దేవి ఆలయంలో హుండీ ఎత్తుకెళ్ళి చెత్త కుప్ప వద్ద పారేశారు. ఈ విషయమై మందిర కమిటి నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.