హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ స్కాం.. వీ వన్​ఇన్​ఫ్రా గ్రూప్స్ డైరెక్టర్లు అరెస్ట్...

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ స్కాం.. వీ వన్​ఇన్​ఫ్రా గ్రూప్స్ డైరెక్టర్లు అరెస్ట్...
  • పెట్టుబడి పేరుతో  వీ వన్ ఇన్ ఫ్రా గ్రూప్స్ 12 కోట్లు ఫ్రాడ్
  • స్కీముల పేరుతో 90 మంది నుంచి డబ్బులు వసూలు
  • బాధితుల ఫిర్యాదుతో ఇద్దరు డైరెక్టర్లు అరెస్ట్


గచ్చిబౌలి, వెలుగు: తమ స్కీముల్లో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో రిటర్న్స్​ఇస్తామని 90 మంది నుంచి రూ.12 కోట్లు వసూలు చేసిన ‘వీ వన్​ ఇన్​ఫ్రా గ్రూప్స్​కంపెనీ మూడు నెలల పాటు రిటర్న్స్​ఇచ్చి బోర్డు తిప్పేసింది. బాధితుల ఫిర్యాదుతో కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లను సైబరాబాద్​ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్​ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఏపీలోని వెస్ట్​గోదావరి జిల్లాకు చెందిన సురేశ్(చైర్మన్)​..‘వీ వన్​ఇన్​ఫ్రా గ్రూప్స్’​ పేరిట కూకట్ పల్లి జేఎన్​టీయూ దగ్గర ఉన్న సర్దార్​పటేల్​నగర్​లో కంపెనీ ప్రారంభించాడు. 

ఇందులో బాపట్లకు చెందిన వంశీకృష్ణ, ఈస్ట్​గోదావరి జిల్లాకు చెందిన వెంకటేశ్​డైరెక్టర్లుగా ఉన్నారు. తమ కంపెనీ మొదలుపెట్టిన రెండు స్కీములలో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో రిటర్న్స్​ ఇస్తామని ప్రచారం చేశారు. మొదటి స్కీమ్​లో 5 లక్షలు పెట్టుబడి పెడితే 25 నెలల పాటు ప్రతి నెల 20,000 చెల్లిస్తామని, 25 నెలల ముగిసిన తర్వాత పెట్టుబడి పెట్టిన 5 లక్షలు కూడా చెల్లిస్తామని ప్రకటించారు. నమ్మకం కోసం గుంట వ్యవసాయ భూమిని రిజిస్ర్టేషన్​ చేస్తామని, గ్యారెంటీ కోసం చెక్కులు కూడా ఇస్తామని తెలిపారు.  రెండవ స్కీమ్​లో రూ. లక్ష పెట్టుబడి పెడితే 36 నెలల పాటు 6000 చొప్పున చెల్లిస్తామని, స్కీము ముగిసిన తర్వాత లక్షలు తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు.

3 నెలలు రిటర్న్స్​ఇచ్చి మూసేశారు..

ఈ స్కీముల గురించి తెలుసుకున్న పటాన్​చెరుకు చెందిన ముత్యాల గోపాల్​మొదటి స్కీములో రూ.6 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీంతో గోపాల్​కు కంపెనీ నుంచి మూడు నెలల పాటు నెలకు రూ.20,000 చెల్లించారు. సదాశివ​పేటలో ఒక గుంట భూమిని కూడా రిజిస్ట్రేషన్​చేసినట్లు పత్రాలు కూడా ఇచ్చారు.  మూడు నెలల నుంచి రిటర్న్స్​ ఇవ్వకపోవడంతో  కంపెనీ ప్రతినిధులను ఆశ్రయించాడు. ఎన్నీ సార్లు కాల్​కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో ఆఫీసుకు వెళ్లాడు. 

అది మూసి ఉండటంతో మోసపోయినట్లు గుర్తించిన గోపాల్.. సైబరాబాద్​ ఎకనామిక్​ అఫెన్సెస్​ వింగ్​పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోపాల్​తో పాటు మరో 25 మంది బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కంపెనీకి చెందిన  ఇద్దరు డైరెక్టర్లు వెంకటేశ్​, వంశీకృష్ణలను బుధవారం అరెస్ట్​ చేశారు. 

ఈ కేసులో కంపెనీ చైర్మన్​ సురేశ్​ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇలా ముగ్గురు కలిసి రెండు స్కీముల పేరుతో 90 మంది బాధితుల నుంచి రూ. 12 కోట్లు వసూళు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.