
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రొక్లమెషన్ పిటిషన్‌పై విచారణ
హైదరాబాద్, వెలుగు: ఫోన్‌ట్యాపింగ్ కేసులో దాఖలైన ‘ప్రొక్లమెషన్’(నేరస్తులుగా ప్రకటించడం) పిటిషన్‌పై నాంపల్లి కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కేసులో రెండో నిందితుడు ప్రణీత్ రావు సహా మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు కోర్టుకు హాజరయ్యారు. ఈ నలుగురు ఇటీవలే బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.
కేసు విచారణలో భాగంగా పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. గతేడాది మార్చిలో ఫోన్‌ట్యాపింగ్ కేసు నమోదు కాగా.. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు తప్పించుకు తిరుగుతున్నారని తెలిపారు. అమెరికాకు పారిపోయి అక్కడే నివాసం ఉంటున్నారని వెల్లడించారు. వీరిద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయని తెలిపారు.
వారెంట్లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో వీరిద్దరినీ ప్రొక్లెయిమ్డ్ అఫెండర్స్‌గా ప్రకటించాలని కోరారు. ఇద్దరిపై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసి.. రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ప్రొక్లమెషన్ ఆర్డర్ ద్వారా త్వరితగతిన ఇండియాకు రప్పించే అవకాశాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు.
అయితే, నిందితుల తరఫున వాదనలు వినిపించేందుకు డిఫెన్స్ లాయర్లు సమయం కోరారు. దీంతో రెగ్యులర్ కేసుతో పాటు ప్రొక్లమెషన్ పిటిషన్‌పై విచారణను కోర్టు మార్చి 21కి వాయిదా వేసింది. డిఫెన్స్ లాయర్లు వాదనలు వినిపించకపోతే.. ఆర్డర్ వెల్లడిస్తామని స్పష్టం చేసింది. కాగా, ప్రొక్లమెషన్‌పై త్వరితగతిన ఉత్తర్వులు జారీ చేసే విధంగా పోలీసులు మరోమారు కోర్టును ఆశ్రయించేందుకు చర్యలు చేపడుతున్నారు.