పేకాటస్థావరంపై పోలీసుల దాడి..మూడో అంతస్తు నుంచి దూకి వ్యక్తి మృతి

పేకాటస్థావరంపై పోలీసుల దాడి..మూడో అంతస్తు నుంచి దూకి వ్యక్తి మృతి
  • సికింద్రాబాద్ ​లాలాపేటలో ఘటన

సికింద్రాబాద్, వెలుగు : పేకాటస్థావరంపై టాస్క్ ఫోర్స్  పోలీసులు దాడి చేయగా తప్పించుకోబోయి ఓ వ్యక్తి మూడో అంతస్తుపై నుంచి దూకి చనిపోయాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లోని లాలాపేటలో జరిగింది. లాలాపేటలోని శాంతినగర్​కు చెందిన వినయ్ కుమార్  (35) ప్రైవేటు ఉద్యోగి. గురువారం రాత్రి లాలాపేటలోని లక్ష్మీనగర్  ప్రాంతంలో గల ఓ భవనంపై  కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు.

అయితే, వినయ్ కుమార్ కూడా రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో లాలాపేటలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్  పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను గమనించిన కొందరు జూదరులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ క్రమంలో వినయ్  కుమార్  తప్పించుకునే ప్రయత్నంలో మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు అంబులెన్స్​లో సికింద్రాబాద్​లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ కుమార్ మృతి చెందాడు.