మాల్దా(బెంగాల్): చేతిలో తుపాకీ పట్టుకొని ఓ వ్యక్తి స్కూల్‌లోకి దూసుకొచ్చిన ఘటన బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో కలకలం రేపింది. గుర్తుతెలియని ఓ వ్యక్తి తుపాకీ పట్టుకొని, గట్టిగా కేకలు వేస్తూ హైస్కూల్‌లోని 8వ తరగతి గదిలోకి ప్రవేశించాడు. స్టూడెంట్లను, క్లాస్ టీచర్‌ను చంపేస్తానని బెదిరించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్‌కు చేరుకొని, అతనికి నచ్చజెప్పే ప్రయత్నంచేసినా, వినలేదు. దీంతో అతన్ని మాటల్లో పెట్టి, అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి, అతడి చేతిలోని తుపాకీని లాక్కున్నాడు.
తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి పిస్టోల్, 2 పెట్రోల్ బాంబులు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడి కొడుకు, భార్య ఒక సంవత్సరం నుంచి కనిపించట్లేదని, తన బాధను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికే ఆ వ్యక్తి ఇలా చేశాడని పోలీసులు చెప్పారు. స్కూల్ పిల్లలను కాపాడిన పోలీసులను సీఎం మమతా బెనర్జీ అభినందించారు.