- హైదరాబాద్‌లో ఊరేగింపులు, ర్యాలీల్లో బ్యాన్
- ఉల్లంఘిస్తే ఐదేండ్ల జైలు.. రూ.లక్ష జరిమానా
- నిర్ణీత డెసిబుల్స్ సౌండ్ స్పీకర్లకే అనుమతి
- రాత్రి 10 నుంచి పొద్దున 6 దాకా కంప్లీట్ బ్యాన్
- సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. మతపరమైన ఊరేగింపులు, ర్యాలీల్లో డీజేలు, సౌండ్ మిక్సర్స్, ఎక్కువ శబ్దాలు వచ్చే యాంపీ ఫ్లయర్స్, క్రాకర్స్ ఉపయోగించరాదని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హాస్పిటల్స్, స్కూళ్లు, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు వంద మీటర్ల దూరంలో తక్కువ శబ్దంతో సౌండ్ సిస్టమ్.. పరిమిత స్థాయిలో మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేండ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తామని తేల్చి చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని పోలీసులకు ఆదేశించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పరిమిత సౌండ్స్‌తో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి సౌండ్ సిస్టమ్‌కు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు.
ఇటీవల పెరిగిన శబ్ధ కాలుష్యం
ఇటీవల జరిగిన గణేష్ నవరాత్రులు, నిమజ్జనాలు, మిలాద్ ఉన్ నబి సందర్భంగా శబ్ధ కాలుష్యం పెరిగిపోయిందని సీపీ సీవీ ఆనంద్ వివరించారు. డీజేలు, క్రాకర్స్ వినియోగంపై గత నెల 26న బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు పాల్గొన్నారు. మతపరమైన ఊరేగింపుల్లో డీజేలు, క్రాకర్స్ కాల్చడంపై చర్చించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మినహా అందరూ డీజే సౌండ్ సిస్టమ్, క్రాకర్స్ వినియోగంపై ఆంక్షలు విధించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా సీపీ సీవీ ఆనంద్ చర్యలు ప్రారంభించారు. వీటి వల్ల తలెత్తే శబ్ధ కాలుష్యం గురించి నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
సౌండ్ పరిమితులు (డెసిబుల్స్‌లో..)
ఏరియా పగలు రాత్రి
నివాస ప్రాంతాలు: 55 45
సైలెన్స్ జోన్స్: 50 40
కమర్షియల్ ఏరియా: 65 55
ఇండస్ట్రియల్ ఏరియా: 75 70