బియ్యం దందా చేస్తున్నాడని చితకబాదిన ఎస్సై

బియ్యం దందా చేస్తున్నాడని చితకబాదిన ఎస్సై
  • హస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్న బాధితుడు

కొత్తగూడ, వెలుగు : బియ్యం దందా చేస్తున్నాడని ఓ వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో అతడు హాస్పిటల్‌‌ పాలయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్‌‌ జిల్లా కొత్తగూడలో శక్రవారం వెలుగుచూసింది. బాధితుడు కొత్తగూడ మండలం రామన్నగూడెం తండాకు చెందిన గుగులోతు బోజ్యా మాట్లాడుతూ నెల క్రితం క్వింటాల్‌‌ పీడీఎస్‌‌ బియ్యాన్ని నర్సంపేటకు తరలిస్తుండగా కొత్తగూడలో కానిస్టేబుల్‌‌ పట్టుకొని పోలీస్‌‌ స్టేషన్‌‌కు తరలించారన్నారు. అక్కడ ఎస్సై దిలీప్‌‌ తన ఫోన్‌‌ లాక్కొని ఇంటికి పంపించారని చెప్పారు.

మరుసటి రోజు గూడూరు సీఐ, కొత్తగూడ ఎస్సై తనను పిలిపించి ఎన్ని రోజులుగా బియ్యం దందా చేస్తున్నావు ? ఎవరికి అమ్ముతున్నావంటూ బాగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సంపేటలో ఓ వ్యాపారికి అమ్ముతున్నానని చెప్పడంతో ఆయనను కూడా పిలిపించారన్నారు. ఆ తర్వాత తహసీల్దార్‌‌ ఎదుట బైండోవర్‌‌ చేసే టైంలోనూ తీవ్రంగా కొట్టారని, రూ. 2 లక్షలు ఇవ్వకుంటే జైలుకు పంపిస్తామని ఎస్సై బెదిరించాడని ఆరోపించారు. శుక్రవారం మరోసారి ఫోన్‌‌ చేసి స్టేషన్‌‌కు రావాలని పిలిచారని, వచ్చాక డబ్బులు అడగడంతో తాను లేవని చెప్పానని, దీంతో ఎస్సై కొట్టాడన్నారు.

దెబ్బలకు తట్టుకోలేక పోలీస్‌‌స్టేషన్‌‌ నుంచి రోడ్డు మీదకు పరుగెత్తగా నలుగురు కానిస్టేబుళ్లు వచ్చి తిరిగి స్టేషన్‌‌కు తీసుకెళ్లారని చెప్పారు. గ్రామ పెద్దలను పిలిపించి, మళ్లీ ఎప్పుడు పిలిచినా రావాలంటూ చెప్పి పంపించారన్నారు. ప్రస్తుతం నడవలేకపోతుండడంతో హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నానని చెప్పాడు. ఎస్సై నుంచి తనను, తన కుటుంబ సభ్యులను రక్షించాలని కోరారు.