రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అవకతవకలకు పాల్పడిందంటూ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈవెంట్స్ లో 4 మీటర్ల లాంగ్ జంప్ నిర్వహించారని బోర్డు దృష్టికి తెచ్చారు. పరుగు పందెం విభాగంలో అర్హత సాధించిన అభ్యర్థులందరిని మెయిన్స్ పరీక్షకు అవకాశం కల్పించే విధంగా చూడాలని కోరారు. తప్పుగా వచ్చిన ప్రశ్నలకు.. మార్కులు కలిపే విషయంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయని బోర్డ్ ఛైర్మెన్ పై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
ఈవెంట్స్ లో డిజిటల్ విధానం ద్వారా నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఏడు విభాగాల్లో ఫీజులు కట్టించుకుని ఒకే విభాగానికి ఈవెంట్స్ నిర్వహించి.. డిస్ క్వాలిఫై చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బోర్డు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమకు మెయిన్స్ కు అవకాశం కల్పించేలా చూడాలని సీఎం కేసీఆర్ ను కోరారు. లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.