భైంసాలోని ఆలయాల్లో చోరీలు చేస్తున్న దొంగ అరెస్ట్

 భైంసాలోని ఆలయాల్లో చోరీలు చేస్తున్న దొంగ అరెస్ట్
  • 3.1 కిలోల వెండి, మూడు గ్రాముల బంగారం స్వాధీనం
  • సహకరించిన భార్య, వెండి వ్యాపారిపై కేసు నమోదు

భైంసా, వెలుగు: భైంసాలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి వెండి, బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం భైంసాలోని తన క్యాంపు ఆఫీస్​లో ఎస్పీ డా.జానకీ షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్​తో కలిసి వివరాలు వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో భైంసాలోని శివాజీ చౌక్​లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద చోరీకి ఉపయోగించే సామగ్రి లభించడంతో పీఎస్​కు తరలించి తమదైన శైలిలో విచారించారు. దీంతో తాను చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. ఆదిలాబాద్​జిల్లా ఊట్నూరుకు చెందిన విజయ్ ​షిండే(36) కొంత కాలంగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బలరాంపూర్​లో ఉంటూ అక్కడ దొంగతనాలు చేస్తున్నాడు. రెండున్నర నెలల నుంచి భైంసా పట్టణలోని నర్సింహస్వామి ఆలయం, పూలే నగర్ హనుమాన్​ మందిర్, సంతోషిమాత మందిర్, కైలాస్​ ఫ్యాక్టరీ పరిధిలోని శ్రీ బాలాజీ దేవాలయంతో పాటు హిమా వైన్స్​లో వరుసగా చోరీలకు పాల్పడ్డాడు.

ఇందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ.. ఆనవాళ్లు లేకుండా చాకచక్యంగా తప్పించుకుంటున్నాడు. చోరీ చేసిన వెండి, బంగారు అభరణాలను విక్రయించేందుకు గాను ఆయన భార్య పూజా షిండే, మహారాష్ట్రకు చెందిన వెండి వ్యాపారి పాండురంగ్​రామారావు సహకరించినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి 3 కిలోల 150 గ్రాముల వెండి, మూడు గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలిస్తున్నామని, అతడి భార్యతోపాటు వ్యాపారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.