కరీంనగర్​ ప్రతిమ మల్టీప్లెక్స్​లో రూ.6.67 కోట్లు పట్టివేత

  • బీఆర్ఎస్ పార్టీ ఫండ్​గా అనుమానాలు
  • ఎంపీ అభ్యర్థి వినోద్ ఎన్నికల ఖర్చు కోసం తరలించారనే ఆరోపణలు
  • రంగంలోకి ఐటీ అధికారులు
  • మల్టీప్లెక్స్ మేనేజర్, సిబ్బంది విచారణ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన ప్రతిమ మల్టీప్లెక్స్ లో పోలీసులు శనివారం తెల్లవారుజామున రూ.6.67 కోట్ల నగదు సీజ్ చేశారు.శుక్రవారం అర్ధరాత్రి టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలు, ఇతర సిబ్బంది దాదాపు 30 మంది పోలీసులు హోటల్ పై మెరుపు దాడి చేసి, తనిఖీలు చేపట్టారు.

దాదాపు 8 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సెల్లార్ లోని అకౌంట్స్ ఆఫీస్ రూమ్ లో రూ.6.67 కోట్ల నగదును గుర్తించినట్టు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. ఈ నగదుకు సంబంధించి  ప్రతిమ హోటల్ జనరల్ మేనేజర్  పీ రాఘవేంద్రబాబును వివరణ కోరగా, సరైన సమాధానం చెప్పకపోవడంతో దొరికిన నగదును వీడియో రికార్డింగ్ లో పంచనామా నిర్వహించి, ఐటీ అధికారులకు అప్పగించారు. 

హైదరాబాద్ టు ప్రతిమ మల్టీప్లెక్స్​

హైదరాబాద్ లోని మెహిదీపట్నం నుంచి శుక్రవారం రాత్రి 9 గంటలకు  డబ్బులతో బయల్దేరిన వెహికిల్ రాత్రి 11.30 గంటలకు ప్రతిమ మల్టీప్లెక్స్ సెల్లార్ కు చేరుకున్నట్టు సమాచారం. ‌వెంటనే అందులోని నగదును తీసి సెల్లార్ లోని ఓ రూమ్ లోకి షిఫ్ట్ చేయగా.. పక్కా సమాచారంతో కరీంనగర్ పోలీసులు ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మల్టీప్లెక్స్ ను చుట్టుముట్టారు. అన్నివైపులా గేట్లకు తాళం వేసి సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే సెల్లారులోని లాకర్లలో తెరిచి‌ చూడగా భారీగా నగదు లభ్యమైంది. నగదు‌ను లెక్కించి రూ.6,67,32,050 గా తేల్చారు.  అయితే మల్టీప్లెక్స్ మేనేజర్ ను పోలీసులు వివరణ కోరగా.. క్యాష్ బయటి నుంచి వచ్చిందని,  పేమెంట్స్ కోసం తీసుకొచ్చామని చెప్పినట్టు తెలిసింది. 

ఐటీ అధికారుల విచారణ 

భారీగా నగదు పట్టుబడటంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ప్రతిమ మల్టీప్లెక్స్ జనరల్ మేనేజర్ రాఘవేంద్ర బాబు, సిబ్బందిని  విచారించారు. మల్టీప్లెక్స్ లో రోజూ ఎంత బిజినెస్ అవుతుంది? వాటి లెక్కలేంటి ? ఇంత భారీగా నగదును ఎక్కడి నుంచి తెచ్చారు ? ఎవరు తరలించారు ?  ఎప్పుడుతీసుకొచ్చారు? అనే కోణంలో సుమారు 12 గంటల పాటు  విచారణ జరిపారు.  
 
ఆ పది పెట్టెల్లో డబ్బులు ఎక్కడ ? 

 డబ్బును కాటన్ బాక్సుల్లో ప్యాక్ చేసి ప్రత్యేక వాహనంలో తరలించినట్టు తెలిసింది. గదిలో కొన్ని బాక్సుల్లో నోట్ల కట్టలు దొరకగా.. సెల్లార్ లో బయట పది వరకు బాక్సులు తెరిచి పడేసి ఉండటం, అందులో నోట్ల కట్టలకు వేసే రబ్బర్ బ్యాండేజీలు వదిలేసి ఉండటం అనుమానాలకు తావిస్తున్నది. అసలు రూ.20 కోట్లపైగా తరలించారని, మిగతా డబ్బు ను ఎక్కడో డంప్ చేసి ఉంటారనే అనుమానాలు‌ వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు కూడా సీసీ ఫుటేజీ ఆధారంగా  ఈ దిశగా విచారణ చేస్తున్నట్టు తెలిసింది. 

ఎన్నికల్లో ఖర్చు చేసేందుకేనా ? 

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన ప్రతిమ మల్టీప్లెక్స్ లో భారీగా నగదు పట్టుబడటం, వాటికి లెక్కలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనాల్లో బీఆర్ఎస్ కు ఆదరణ తగ్గడంతో విచ్చలవిడిగా డబ్బులు పంచి ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతోనే భారీగా నగదును డంప్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులంతా శివరాత్రి ‌వేడుకల సందర్భంగా ఆలయాల్లో బందోబస్తులో ఉన్న  సమయంలో జిల్లాకు రూ.20 కోట్లు తరలించినట్టు ప్రచారం జరుగుతున్నది.