- పంజాబ్ టు హైదరాబాద్‌కు చాక్లెట్లు
- పలుచోట్ల ఏకంగా ఇంట్లోనే అమ్మకాలు
- గ్రేటర్ పరిధిలో సోమవారం పలువురి అరెస్టు
హైదరాబాద్ సిటీ/ జీడిమెట్ల/ మెహిదీపట్నం, వెలుగు: గ్రేటర్ పరిధిలో సోమవారం పలుచోట్ల భారీగా గంజాయి పట్టుబడింది. పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి చాక్లెట్లుతరలిస్తున్న వ్యక్తిని మాదాపూర్ఎస్వోటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.లక్ష విలువైన 12 .68 కేజీల చాక్లెట్లు, 80 గ్రాముల డ్రై గంజాను స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండకు చెందిన ఇసార్సింగ్(55) చెడు అలవాట్లకు బానిసై ఈజీ మనీ కోసం గంజాయి దందా మొదలుపెట్టాడు.
పంజాబ్ నుంచి గంజాయి చాక్లెట్లను తెచ్చి సిటీలోని కన్స్ట్రక్షన్ వర్కర్క్కు ఒక్కోటి రూ.40కి విక్రయిస్తున్నాడు. సుచిత్ర క్రాస్ రోడ్డులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో జగద్గిరిగుట్ట, జీడిమెట్ల ఠాణాల పరిధిలో ఎన్డీపీఎస్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
అప్పర్ ధూల్‌పేట్‌లో మహిళ..
అప్పర్ ధూల్‌పేట్ బలరాంగల్లీలోని ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్న మహిళను పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని సంధ్యాబాయ్గా గుర్తించి, 1.863 కిలోల గంజాయి, రూ.62 వేల నగదును సీజ్ చేశారు. ఆమెకు సరుకు సరఫరా చేసిన అభిషేక్ సింగ్, సంజనా బాయ్, రాజ్ నందిని సింగ్, అతిశ్ సింగ్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరిండెంట్, ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ నంద్యాల అంజి రెడ్డి తెలిపారు.
సులువుగా సంపాదించడం కోసం..
మరోచోట గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు గంజా కొడుతున్న మరో ఏడుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. రాంరెడ్డినగర్‌కు చెందిన మహ్మద్ సైఫ్ అలీ (26) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి తన ఇంట్లో పలువురికి విక్రయిస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారంతో సైఫ్ అలీతోపాటు గంజాయి సేవిస్తున్న రోడా మేస్త్రీనగర్‌కు చెందిన షేక్ హిదాయత్ (24), ఇమ్రాన్ అలియాస్టిబు, (32), మహ్మద్ అజామ్ (34), వివేకానందనగర్‌కు చెందిన ఆవుల దినీశ్రెడ్డి (23), అల్వీన్కాలనీకి చెందిన రాహుల్ సింగ్ (23), ఇందిరానగర్‌కు చెందిన మహ్మద్ మజీద్ (28) శ్రీనివాస్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఫిరోజ్ (38) ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్ టెస్టులు చేయగా, అందరికీ పాజివ్ రావడంతో అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తంగా 850 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.