జాంబాగ్​పూల మార్కెట్ లో డ్రగ్స్​ పట్టివేత

జాంబాగ్​పూల మార్కెట్ లో డ్రగ్స్​ పట్టివేత
  • 27 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్, ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్​సిటీ, వెలుగు: మొజంజాహి మార్కెట్ సమీపంలోని జాంబాగ్ ఫ్లవర్ మార్కెట్ ప్రాంతంలో డ్రగ్స్ పట్టుబడింది. ఈ ఘటనలో ఇద్దరిని ఎక్సైజ్  ఎస్​టీఎఫ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి రూ. 1.62 లక్షల విలువైన 27 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ లోని జాలర్​ ప్రాంతానికి చెందిన సుశీల్​కుమార్ కుటుంబం హైదరాబాద్ కు వచ్చి చిరు వ్యాపారం చేస్తోంది. 

ఆశించిన లాభాలు రాకపోవడంతో డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టాడు. రాజస్థాన్​కు  చెందిన ప్రవీణ్ సింగ్ రావ్ బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రవీణ్ సలహాతో సుశీల్ కుమార్ బెంగళూరులో ఒక గ్రాము డ్రగ్స్​ను రూ.3 వేలకు కొనుగోలు చేసి, హైదరాబాద్​లో రూ.6 వేలకు అమ్మడం ప్రారంభించాడు.

హైదరాబాద్ కు చెందిన రమేశ్, చరణ్ వద్ద డ్రగ్స్​కొన్నాడు. కాచిగూడ రైల్వే స్టేషన్ క్వార్టర్స్ చెందిన  పలుకూరి దీపక్​కు ఆదివారం  డ్రగ్స్ అమ్ముతుండగా, ఇద్దరిని ఎక్సైజ్ పోలీసుల అరెస్ట్ చేశారు. హితేశ్, షేక్ మహమ్మద్, బాబిలకు కూడా డ్రగ్స్ అమ్మినట్టు సుశీల్​తేలడంతో వారిపైనా కేసులు నమోదు చేశారు. 

2 కేజీల గంజాయి పట్టివేత

హయత్ నగర్ తొర్రూర్ ఎక్స్ రోడ్​లో రెండు కేజీల గంజాయి పట్టుబడింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బొల్లారం ప్రాంతానికి చెందిన పసుపులేటి లోకేశ్ రెండు కిలోల గంజాయిని ఇతరులకు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా, ఎక్సైజ్ ఎస్ టీఎఫ్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. నిందితుడి నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.