శంషాబాద్​ ఎయిర్​పోర్టులో పోలీసులకు చిక్కిన మాజీ ఎమ్మెల్యే షకీల్​

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో పోలీసులకు చిక్కిన మాజీ ఎమ్మెల్యే షకీల్​
  • కొడుకుని కేసుల నుంచి తప్పించి దుబాయ్‌‌కి ఎస్కేప్‌‌
  • ఏడాదిన్నరగా దుబాయ్‌‌లోనే మకాం  
  • తల్లి మృతి చెందడంతో హైదరాబాద్‌‌కు..  
  • ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లకు పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే
  • అంత్యక్రియలకు వెళ్లడానికి అనుమతి

హైదరాబాద్‌‌/శంషాబాద్/బోధన్, వెలుగు : బోధన్‌‌ మాజీ ఎమ్మెల్యే షకీల్​ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కొంతకాలంగా దుబాయ్‌‌లో తలదాచుకుంటున్న షకీల్‌‌.. తల్లి మరణంతో గురువారం హైదరాబాద్‌‌ వచ్చారు. ఆయనపై లుక్​అవుట్​సర్క్యులర్లు జారీ కావడంతో శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

తర్వాత పంజాగుట్ట, బంజారాహిల్స్‌‌, నిజామాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకున్న పోలీసులు.. షకీల్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి చనిపోయిందని చెప్పడంతో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తమ ముందు హాజరుకావాలని నోటీసులిచ్చి పంపించారు. దీంతో ఆయన బోధన్​కు వెళ్లిపోయాడు.

కొడుకును కేసు నుంచి తప్పించేందుకు..

బీఆర్‌‌‌‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌‌పై ఇప్పటికే ఆయనపై అనేక కేసులున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో కొడుకు రాహిల్‌‌పై కేసులు నమోదు కాగా, అతడిని తప్పించేందుకు ప్రయత్నించాడని, కొడుకును దుబాయ్​పంపించాడన్న ఆరోపణలు ఉన్నాయి. 2023 డిసెంబర్‌‌‌‌ 23న ప్రజాభవన్‌‌ వద్ద షకీల్‌‌ కొడుకు రాహిల్​కారుతో బీభత్సం సృష్టించాడు. తాగిన మైకంలో రాత్రి 2.45 గంటల ప్రాంతంలో ప్రజాభవన్‌‌ వద్ద బారికేడ్లను ఢీ కొట్టాడు. 

ఆ సమయంలో కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులున్నారు. పంజాగుట్ట పోలీసులు స్పాట్‌‌కు వెళ్లి కారు నడుపుతున్న రాహిల్‌‌ను పీఎస్‌‌కు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న షకీల్‌‌ ఆ రోజు రాత్రే పోలీస్‌‌స్టేషన్‌‌కు వచ్చి కొడుకుకు బదులు ఇంట్లో పనిచేస్తున్న అబ్దుల్‌‌ ఆసిఫ్‌‌ను నిందితుడిగా చేర్చారు. సీసీ ఫుటేజ్‌‌ పరిశీలించిన పోలీసులు షకీల్‌‌ను కూడా కేసులో నిందితుడిగా చేర్చారు. తర్వాత పోలీసులకు మస్కా కొట్టి కొడుకుతో సహా దుబాయ్‌‌ పారిపోయాడు.

బంజారాహిల్స్‌‌ రోడ్డు ప్రమాద కేసులోనూ.. 

2022  మార్చి 18న తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్‌‌ నంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదంలోను షకీల్ కొడుకు రాహిల్ నిందితుడిగా ఉన్నాడు. దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్‌‌ వైపు మహింద్రా థార్‌‌ వాహనంలో వస్తున్న కొందరు యువకులు.. రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు గాయపడగా, రెండు నెలల పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు కారులోని యువకులు పారిపోయారు. 

వెహికల్​అక్కడే వదలగా ఎమ్మెల్యే స్టిక్కర్​ఉండడంతో విచారించగా బోధన్​మాజీ ఎమ్మెల్యే షకీల్‌‌ది అని తేలింది. ప్రమాదం జరిగినప్పుడు తన కొడుకు లేడని షకీల్‌‌ ప్రకటించాడు. బాధితుల వాంగ్మూలాలు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కారులో రాహిల్‌‌ ఉన్నట్లు తేలింది. డ్రైవింగ్‌‌ సీట్‌‌ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితురాళ్లు వాంగ్మూలం ఇవ్వడంతో రాహిల్‌‌ డ్రైవింగ్‌‌ సీట్లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో కూడా షకీల్ తన కుమారున్ని తప్పించినట్లు పోలీసులు గుర్తించారు. 

తల్లి చనిపోవడంతో వచ్చి...

రెండు కేసుల్లో ఉన్న షకీల్​సహా రాహిల్‌‌ దుబాయ్ పారిపోయారు. వీరిద్దరిపై పంజాగుట్ట, బంజారాహిల్స్ పోలీసులు లుక్‌‌ అవుట్‌‌ సర్క్యులర్ జారీ చేశారు. గతేడాది ఏప్రిల్‌‌ 8న దుబాయ్‌‌ నుంచి వచ్చిన రాహిల్‌‌ను ఇమ్మిగ్రేషన్ అధికారుల సహకారంతో పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుసగా కేసులు నమోదు కావడం, నాన్‌‌ బెయిలబుల్ వారెంట్లు, లుక్‌‌ అవుట్ సర్క్యలర్లు ఉండడంతో ఏడాదిన్నరగా షకీల్ ఇండియాకు రావడం లేదు. 

కొన్ని రోజులుగా హైదరాబాద్ యశోద హాస్పటల్‌‌లో చికిత్స పొందుతున్న అతడి తల్లి షగుఫ్తా అదీద్​ (80) గురువారం తెల్లవారుజామున చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న షకీల్‌‌ హైదరాబాద్ వచ్చాడు. దీంతో ఇమ్మిగ్రేషన్​అధికారుల సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్‌‌ తల్లి పార్థీవదేహాన్ని మధ్యాహ్నం బోధన్‌‌కు తరలించారు. అంత్యక్రియల తర్వాత తమ ముందు హాజరుకావాలని నిబంధనలతో కూడిన అనుమతి ఇస్తూ విడిచిపెట్టారు. దీంతో ఆయన బోధన్​వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.