- సిండికేట్‌లోని నలుగురు కీలక వ్యక్తుల అరెస్ట్‌తో కదులుతున్న డొంక
- ఎంక్వైరీలో పలువురు బీఆర్ఎస్నేతలతోపాటు పోలీసుల పేర్లు
- అక్రమార్కులపై డీజీపీకి ఫిర్యాదు
- మరోవైపు కొనసాగుతున్న ఎంక్వైరీ
సూర్యాపేట, వెలుగు : రేషన్ బియ్యం దందాలో తొవ్విన కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సిండికేట్ లోని నలుగురు కీలక వ్యక్తుల అరెస్ట్‌తో డొంక కదులుతోంది. ఎంక్వైరీలో పలువురు బీఆర్ఎస్ నాయకులతోపాటు వివిధ స్థాయిలో ఉన్న 11 మంది పోలీసుల పేర్లు బయటపడున్నాయి. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల సపోర్ట్ తో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసిన నిందితులను అరెస్ట్ చేయడంతో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
సామాన్యులకు అండగా ఉంటూ రక్షణగా కల్పించాల్సిన పోలీసులు అక్రమార్కులతో చేతులు కలిపి అనేక దందాలకు పాల్పడినట్లు తెలిసింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో 10 ఏండ్లపాటు వీరి ఆగడాలను భరించలేక పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. వీరిపై ఫిర్యాదులు చేస్తే ఏకంగా పోలీసులే బాధితులపై తిరిగి కేసులు పెట్టిన వైనం నాటి ప్రభుత్వ హయాంలో నెలకొన్నాయి. మరోవైపు ఆక్రమార్కులతోపాటు వారికి సహకరించిన పోలీసులపై చర్యలు చేపట్టాలని ఓయూ జేఏసీ నాయకుడు జతంగి సురేశ్ మంగళవారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
పోలీసులతోనే పీడీఎస్ దందా..
అక్రమ రవాణాలో జిల్లాలో దొరికిన రేషన్ బియ్యాన్ని ఏపీలోని కాకినాడ పోర్ట్ కు తరలించారు. ఇందులో ఏకంగా పోలీస్ ఉన్నతాధికారే కీలకంగా వ్యవహరించారు. ఎవరైనా పోలీసులు రవాణాను అడ్డుకుంటే నేరుగా ఆ ఉన్నతాధికారి నుండే కాల్స్ చేసి విడిపించేవారని పోలీస్ శాఖలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. గతంలో సూర్యాపేట నియోజకవర్గంలో నైట్ డ్యూటీ చేసే సమయంలో ఒక కానిస్టేబుల్ పీడీఎస్ బియ్యం లారీ పట్టుకుంటే ఏకంగా ఉన్నతాధికారి నుండే విడిచిపెట్టాలని ఫోన్ రావడంతో ఆయన అవాక్కయ్యాడు.
ALSO READ : కేటీఆర్, హరీశ్ దొరతనం మళ్లా బయటపడ్డది: మంత్రి సీతక్క
అదే కాకుండా జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయ్యే సమయంలో సూర్యాపేటలో పీడీఎస్ బియ్యం లోడ్ తో ఉన్న రెండు డీసీఎంలను పట్టుకొని స్టేషన్ కు తీసుకొచ్చినా వారిపై కేసు కాకుండా ఉన్నతాధికారే సెటిల్ మెంట్ చేశారు. ఇందుకు ఆ ఉన్నతాధికారి బదిలీపై వెళ్తున్న సమయంలో ఆయనకు ఒక ఫంక్షన్ హాల్ లో గ్రాండ్ గా సన్మానం చేసినట్లు సమాచారం.
కోట్ల విలువైన భూములపై కన్ను..
కలెక్టరేట్ కు కూత వేటు దూరంలో ఉన్న కుడకుడ భూములను పెద్ద ఎత్తున ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆక్రమించిన భూముల్లో రియల్ దందాకు తెర లేపారు. రియల్ ఎస్టేట్ పేరుతో వెంచర్లను ఏర్పాటు చేసి చాలా మంది పోలీసులకు గిఫ్టుల రూపంలో పాట్లు ఇచ్చినట్లు సమాచారం. కుడకుడ భూ దందాలో పోలీసులతో సెటిల్ మెంట్లను ఈ గ్యాంగ్ చేసి పెట్టుబడులు వీరితోనే పెట్టించారనే విమర్శలు ఉన్నాయి. సెటిల్ మెంట్ల కోసం ఐలపురం స్టేజి వద్ద ఉన్న ఒక వెంచర్ అడ్డాగా చేసుకొని అనేక దావత్ లు చేశారని, ఈ దావత్ లో ఉన్నతాధికారి సైతం పాల్గొనేవారని స్థానికులు చెబుతున్నారు.
ఎవరా 11 మంది..?
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారికి ముఖ్యంగా 11 మంది పోలీసులు కీలకంగా పనిచేసినట్లు సమాచారం. ఇందులో పైనుంచి కింది స్థాయి వరకు పోలీసులు ఉన్నారని తెలిసింది. అయితే గతంలో ఈ దందాకు వత్తాసు పలికిన ఒక సీఐపై వేటు పడింది. ఇప్పుడు ఆ 11 మంది పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ఆసక్తికరంగా మారింది. మరోవైపు సెలవులో ఉన్న ఎస్పీ తిరిగి డ్యూటీలో జాయిన్ అవ్వడంతో విచారణ సమయంలో పోలీసుల పాత్ర ఉందని తెలిసింది.
దీంతో పోలీసుల పాత్రపై ఎంక్వైరీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అక్రమార్కుల కాల్ డేటాపై విచారణ చేస్తున్న పోలీసులు.. ఆ ముఠాకు చెందిన ఒక సభ్యుడి హాస్పిటల్ సీసీ ఫుటేజ్ సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారో.. వీరికి శిక్ష పడుతుందో అన్న చర్చ ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.