కరీంనగర్ మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో ఫిభ్రవరి 18న మిస్సయిన ఆడ శిశువును పోలీసులు క్షేమంగా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా తక్కల్లపల్లికి చెందిన కవిత అలియాస్ పద్మ అనే మహిళ కిడ్నాప్ చేసినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపై నరేందర్ వెల్లడించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పాపకు వాక్సిన్ వేయించి తీసుకొస్తానని బెడ్ దగ్గరున్న బాలుడిని నమ్మించి పసికందును కిడ్నాప్ చేసినట్లు చెప్పారు.
నిందితురాలు పద్మకు రెండో వివాహనం అయిన తర్వాత సంతానం లేదు. జమ్మికుంటలోని ఎర్రంరాజు జగ్గం రాజు(DHMS) అనే వైద్యుని సలహా మేరకు కరీంనగర్ మాతా శిశు ఆస్పత్రిలో ప్లాన్ చేసి పసికందును ఎత్తుకెళ్లారు. వరంగల్ లేదా కరీంనగర్ ఆస్పత్రికి వెళ్తే పాప లేదా బాబును ఎత్తుకు రావచ్చని జమ్మికుంట డాక్టర్ సలహా ఇచ్చాడు. కిడ్నాప్ చేసిన మహిళతో పాటు సలహా ఇచ్చిన డాక్టర్ జగ్గం రాజును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాపను తీసుకుని ముందుగా జమ్మికుంటకు వెళ్లి సలహా ఇచ్చిన డాక్టర్ కు చూపించింది నిందుతురాలు. ఆరోగ్యంగా ఉందని చెపపడంతో తిరిగి తక్కళ్లపల్లికి వెళ్లింది మహిళ. ఆటో ఎక్కి వెళ్లిన మహిళను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసు బృందాలు ట్రేస్ చేసి తక్కళ్ల పల్లిలో మహిళ నుంచి పాపను స్వాధీనం చేసుకుని పేరెంట్స్ కు అప్పగించారు.