నిలోఫర్ పసికందు కిడ్నాప్ కేసును 6 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

నిలోఫర్ పసికందు కిడ్నాప్ కేసును  6 గంటల్లోనే  ఛేదించిన పోలీసులు


హైదరాబాద్ : నిలోఫర్ దవాఖానాలో చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఆరు గం టల్లోనే చిన్నారి ఆచూకీ కనుగొన్నారు. జహీరాబాద్ కు చెందిన హసీనా బేగం, గఫార్ దంపతులకు చెందిన నెల రోజుల బాబుకు జాండీస్ రావడంతో సిటీలోని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం రాత్రి హసీనా బేగం బాబును ఎత్తుకొని ఉండగా.. ఆసుపత్రి సిబ్బందిని అని తల్లిని నమ్మించిన ఓ మహిళ బాబుని కిడ్నాప్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. 

బాబుని సిటీ నుండి కర్నూల్ వైపు తరలించారని గుర్తించి, జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉండవెల్లి, అలంపూర్, మానవపాడు చెందిన పోలీసులు ఉండవెల్లి మండల పరిధి లోని పుల్లూరు టోల్గేట్ సమీపంలో వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. ఇవాళ తెల్లవారు జామున ఓమ్ని వ్యాన్ లో ముగ్గురు చిన్నారులతో ఆరుగురు కలిసి తీసుకెళ్తున్నట్లు గుర్తిం చారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని నాంపల్లి పీఎస్ కు అప్పగించారు. అనంతరం పోలీసులు చిన్నారిని సేఫ్ గా తల్లి హసీనా బేగం వద్దకు చేర్చారు.