కర్ణాటకలోని మంగళూరులో ఆటో రిక్షా బ్లాస్ట్ ఘటన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉగ్రఘటనలు నివారించే చర్యల్లో భాగంగా మైసూరులో అద్దెదారుల కోసం కొత్త రూల్ తీసుకొచ్చారు. నగరం పరిధిలో ఇంటిని అద్దెకు తీసుకునే ముందు పోలీసుల క్లియరెన్స్ సర్టిఫికెట్ ను తీసుకోవాలనే నిబంధనను అమల్లోకి తెచ్చారు.
తమ ఇంటిని ఎవరికి అద్దెకు ఇవ్వాలనుకున్నారో వారి నుంచి ఇంటి యజమాని పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ను తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంట్లో అద్దెకు దిగిన వారి వివరాలను మైసూరు పోలీసులకు తెలియజేయాలని వెల్లడించారు. వాటిని నిర్ధారించిన తర్వాతే పోలీసులు ఇంటి యజమానికి క్లియరెన్స్ సర్టిఫికెట్ ను ఇష్యూ ఇస్తారు. బ్యాచిలర్స్, ఫ్యామిలీ, పేయింగ్ గెస్టులకు వేర్వేరు దరఖాస్తులు ఉంటాయని పోలీసులు తెలిపారు.
మంగళూరు బ్లాస్ట్ నిందితుడు షరీఖ్ ఉగ్ర కార్యకలాపాల కోసం నకిలీ ధృవపత్రాలతో ఓ ఇంటిలో అద్దెకు దిగాడు. ఇలా ఫేక్ డాక్యుమెంట్లతో ఉగ్రవాదులు నగరంలో అద్దెకు దిగి ఉగ్ర కుట్రలకు తెరలేపే ముప్పు ఉన్నందున మైసూరు పోలీసులు ఈ కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చారు.