మంచిర్యాలలో వాహనాల వేగానికి స్పీడ్‌‌‌‌ గన్స్​తో కళ్లెం : ఎం.శ్రీనివాస్

మంచిర్యాలలో వాహనాల వేగానికి స్పీడ్‌‌‌‌ గన్స్​తో కళ్లెం : ఎం.శ్రీనివాస్

మంచిర్యాల/ఆదిలాబాద్, వెలుగు: మంచిర్యాల జోన్ పరిధిలో ప్రమాదాల నివారణకు జాతీయ, రాష్ట్ర రహదారులపై నిర్ణీత వేగానికి మించివెళ్లే వాహనాలపై చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కమిషనరేట్ పోలీస్ ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తోందని అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కమిషరేట్​లో ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై ప్రతిరోజూ నిఘా పెట్టి అతి పెద్దపల్లి, మంచిర్యాల ట్రాఫిక్​పోలీస్​ స్టేషన్ల పరిధిలో వేగంగా వెళ్లే వాహనాలపై 7047 కేసులు పెట్టి రూ.72,77,445 జరిమానా విధించినట్లు తెలిపారు. మూడు స్పీడ్‌‌ గన్‌‌ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం ప్రమాదాలు జరిగే 53 ప్రాంతాలను బ్లాక్‌‌ స్పాట్లుగా గుర్తించి అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. 

ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలి

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతామని ఆదిలాబాద్​కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లతో అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు భద్రతా వారోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ద్వారా ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, రవాణా శాఖ డీటీసీ రవీందర్, డీటీవో శ్రీనివాస్, ఎంవీఐలు శ్రీనివాస్, ప్రదీప్ డీఏస్పీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.