జడ్చర్ల, వెలుగు: పట్టణంలో పందుల నివారణ పేరుతో జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ భర్తతో పాటు కొందరు కౌన్సిలర్లు రూ.1.30 కోట్లు విలువ చేసే పందులను అడ్డదారిలో అమ్ముకొని తమ పొట్టకొట్టారని కావేరమ్మపేటకు చెందిన పందుల యాజమానులు శనివారం జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు బాలస్వామి మాట్లాడుతూ పట్టణంలో తిరుగుతున్న పందులను మున్సిపల్ చైర్ పర్సన్ భర్త దోరేపల్లి రవీందర్ మరి కొందరితో కలిసి అమ్ముకున్నారని ఆరోపించాడు.
అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఇదిలాఉంటే పందుల తరలింపు వ్యవహారంలో తనకెలాంటి సమాచారం, ఫిర్యాదు అందలేదని మున్సిపల్ కమిషనర్ మహ్మద్ షేక్ వివరణ ఇచ్చారు.
మాకెలాంటి సంబంధం లేదు..
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పందుల తరలింపు వ్యవహారంలో తమపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి రవీందర్ వివరణ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తమపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని కొట్టి పారేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని పందులను బార్డర్ దాటించినట్లు తెలిపారు. ఇందులో జరిగిన లావాదేవీల్లో తమకెలాంటి సంబంధం లేదన్నారు. వైస్ చైర్ పర్సన్ పాలాది సారిక రామ్మోహన్, కౌన్సిలర్లు రఘురాంగౌడ్, నందకిషోర్ గౌడ్, కోట్ల ప్రశాంత్ రెడ్డి, చైతన్య, జ్యోతి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.