హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, వినోబా నగర్లోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాలను ‘గురుకుల బాట’ కార్యక్రమంలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. అయితే.. తమ పాఠశాలలోకి ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశించారని పోలీస్ స్టేషన్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు.
తెలంగాణలోని గురుకుల, సంక్షేమ హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ ఐదుగురితో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. గురుకులాలను, హాస్టల్స్ను తనిఖీ చేసి సర్కార్ను నిలదీస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ కమిటీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో గురుకులాలపై కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అంటూ జరుగుతున్న దుష్ప్రచారంలో ఆర్ఎస్పీ పాత్ర ఉందని ఆమె అన్నారు. ఫుడ్ పాయిజన్ఘటనల వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుందని.. దీనిపై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు.