పెరుగుతున్న బకాయిలు .. ఆందోళనలో ఖాకీలు!

పెరుగుతున్న బకాయిలు .. ఆందోళనలో ఖాకీలు!
  • పండుగలకు ముందైనా సర్కారు చెల్లించేనా?
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అప్పులతో కాలం వెళ్లదీస్తున్న పోలీసులు 
  • టీఏ, డీఏ, సరెండర్​ లీవ్స్, జీపీఎఫ్, పీఆర్సీ బకాయిలు రూ.50కోట్లకు పైగానే..
  • బీఆర్​ఎస్​ సర్కార్​పట్టించుకోలే.. కాంగ్రెస్​ సర్కార్​పైనే భారం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : టీఏ, డీఏ, సరెండర్​ లీవ్స్, జీపీఎఫ్, పీఆర్సీ బకాయిలు రెండున్నరేండ్లుగా చెల్లించకపోవడంతో ఖాకీలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పోలీసులకు దాదాపు రూ.50కోట్లకు పైగానే బకాయిలు రావాల్సి ఉంది. బకాయిలు చెల్లిస్తేనే తమ ఇండ్లలో దసరా, దీపావళి అంటూ పోలీసులు వాపోతున్నారు. బీఆర్ఎస్​ సర్కార్​ బకాయిల చెల్లింపుల్లో చేసిన నిర్లక్ష్యం కాంగ్రెస్​ గవర్నమెంట్​కు గుదిబండగా మారింది. 

1,600 మందికిపైగా సిబ్బంది.. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దాదాపు 1,600 మందికి పైగా పోలీసులు పలు హోదాల్లో పనిచేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంతో పాటు ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తరుచూ జిల్లాలో పర్యటిస్తుంటారు. దీంతో నిత్యం ఏదో ఒకచోట బందోబస్తు, ఇతర స్పెషల్​ డ్యూటీలతో పోలీసులు ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కానిస్టేబుల్​ స్థాయి నుంచి ఎస్పీ వరకు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంది.

దాదాపు రెండున్నరేండ్ల నుంచి టీఏలు, డీఏలు, సరెండర్​ లీవ్స్​, పీఆర్సీ అరియర్స్, జీపీఎఫ్​తో పాటు కొత్త పీఆర్సీ రావాల్సి ఉంది. ఒక్కొక్కరికీ రూ. రూ.లక్ష నుంచి రూ. 3లక్షలకు పైగా బకాయిలు పెండింగ్​లో ఉన్నాయి. పిల్లల ఫీజులు, దసరా పండుగకు దుస్తులు, వైద్య ఖర్చులు.. ఇలాంటి అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుందని పలువురు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్​తో పాటు పలు జిల్లాల్లో బందో బస్తు నిర్వహించిన బకాయిలు కూడా చెల్లించకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

కాలం వెళ్లదీసిన బీఆర్ఎస్​!

గత బీఆర్ఎస్​ప్రభుత్వం టీఏ, డీఏ, సరెండర్​ లీవ్స్​తో పాటు పీఆర్సీ బకాయిలతో పాటు జీపీఎఫ్​ లోన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రేపు, మాపంటూ రెండున్నరేండ్ల కాలంగా వెళ్లదీసింది. దీంతో బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. గతంలో రూ. 30 కోట్లకు పైగా ఉన్న బకాయిలు ప్రస్తుతానికి రూ.50కోట్లకు చేరుకున్నాయి. బకాయిలు చెల్లించాలని గత ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క​ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పోలీస్​అధికారులు వినతిపత్రాన్ని ఇచ్చారు.  సీఎం రేవంత్​ రెడ్డి స్పందించి జిల్లాకు రావాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు 
కోరుతున్నారు.