గుట్కాపై ఉక్కుపాదం .. ఆదిలాబాద్​ జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

  • 22 రోజుల్లో రూ. 1.30 కోట్ల గుట్కా స్వాధీనం 
  • 63 మందిపై కేసులు నమోదు 
  • పట్టణాల నుంచి పల్లెలదాక పాకిన గుట్కా దందా
  • గుట్టుచప్పుడు కాకుండా గోదాముల్లో డంప్ 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లాలో కొంత కాలంగా గుట్కా మాఫియా రెచ్చిపోతోంది. పట్టణ, గ్రామీణా ప్రాంతాలనే తేడా లేకుండా నిషేధిత గుట్కాను యథేచ్ఛగా అమ్ముతూ వ్యాపారులు కోట్లు దుండుకుంటున్నారు. గుట్కాను సరఫరా చేసే వ్యాపారులపై కేసులు పెడుతున్నప్పటికీ దందాను ఆపకుండా వివిధ మార్గాల్లో కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గుట్కా దందాపై పోలీసులు స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతుండటంతో గుట్కా నిల్వలు గుట్టులుగా బయటపడుతున్నాయి.

ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిల్లో ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు, నికోటిన్ ఉండటంతో వాటిని నిషేధించినట్లు పేర్కొంది. గుట్కా, పాన్ మసాలాను తయారు చేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో గుట్కా నిర్మూలనపై పోలీసులు ఫోకస్ పెట్టారు. 

మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సరఫరా

గుట్కాపై నిషేధం విధించడంతో జిల్లా ఎస్పీ గౌస్​ఆలం ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. గత 22 రోజుల్లోనే రూ.1.30 కోట్ల గుట్కాను పట్టుకున్నారు. 42 కేసులు నమోదు చేసి 63 మందిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్​జిల్లాకు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలు, పల్లెలకు గుట్కాను గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతోంది.

ఈ క్రమంలో పోలీసులు కొన్ని రోజులుగా దాడులు చేస్తుండటంతో ఈ దందా పెద్ద ఎత్తున బయటపడుతోంది. వారం రోజుల క్రితం ఒకే రోజు గోదాముల్లో దాడులు చేసి రూ.77 లక్షల విలువైన గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్​గా తీసుకోవడంతో జిల్లాల్లో గుట్కా, గంజాయి తదితర మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.  

గోదాం, మిల్లులే అడ్డాగా..

ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న గోదాములు, జిన్నింగ్ మిల్లులు, పురాతన ఇండ్లే అడ్డాగా గుట్కా నిల్వలు భారీగా డంప్ చేస్తున్నారు. ఇక్కడ నిల్వ చేసి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. దీంతో జిన్నింగ్ మిల్లులు, గోదాములకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటి నుంచి ఎవరైన నిషేధిత గుట్కా నిల్వలకు రెంట్​కు ఇస్తే యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ గోదాములు, జిన్నింగ్ మిల్లుల నుంచే జిల్లా కేంద్రంలోని పలు ట్రేడర్స్, గ్రామాల్లోని కిరాణా షాపులకు పరఫరా చేస్తూ విక్రయిస్తున్నారు. నిషేధిత గుట్కాతోపాటు సాధారణ తంబాకును సైతం బ్రాండ్ పేర్లతో విక్రయాలు జరుపుతున్నట్లు ఇటీవల బయటపడింది. అనర్, ఎస్ఆర్ వన్, ఎక్సెల్ వన్, షార్ట్ 999, ఆర్ 50, జెడ్ఎల్, సితార గుట్కా, మాణిక్​చంద్, హెచ్ ఫైవ్, స్వాగత్ వంటి రకాల గుట్కాను రాష్ట్రంలో నిషేధించారు.  

గుట్కా నియంత్రణే లక్ష్యంగా దాడులు

జిల్లాలో గుట్కా నియంత్రణే లక్ష్యంగా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు దాడులు చేపడుతున్నాం. గోదాములు, జిన్నింగ్ మిల్లులను గుట్కా నిల్వుల కోసం అద్దెకు ఇచ్చిన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తాం. గుట్కా వ్యాపారం చేసే ఎవరినైనా వదిలిపెట్టేది లేదు. 

జీవన్ రెడ్డి, డీఎస్పీ ఆదిలాబాద్