- వాట్సాప్ ద్వారా కస్టమర్లకు ఫొటోలు
- వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు
- 11 మంది అరెస్టు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లోని పలు కాలనీల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. బుధవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, టీచర్స్ కాలనీ, టూ టౌన్ ఠాణాలోని విద్యానగర్ లోని గృహాలపై దాడి చేసినట్లు తెలిపారు. ముగ్గురు మహిళలతోపాటు 8 మంది పురుషులను అరెస్టు చేయగా ఒకరు పరారీ ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో ఐదుగురు విటులు ఉన్నట్లు వివరించారు.
ఈ మూడు చోట్ల వ్యభిచార గృహాలు నిర్వహించడంలో కీలకమైన నిందితుడు, ‘శూర్’ ఎన్జీవో కో ఆర్డినేటర్ బాబా సాహెడ్ అలియాస్ తరుణ్ అనే వ్యక్తి.. హెచ్ఐవీపై వివిధ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ అమాయక మహిళలను వ్యభిచార ఊబిలోకి లాగుతున్నట్లు తేలిందన్నారు. సదరు మహిళల ఫొటోలు వాట్సాప్ ద్వారా పంపించి కస్టమర్లను ఆకర్షించి, అద్దె ఇండ్లలో గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన కపిల్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా ముగ్గురు మహిళలు, 9 మంది పురుషులపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. వీరి వద్ద నుంచి రూ 7,500 నగదు, 11 సెల్ ఫోన్లు, నాలుగు బైక్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బాధిత మహిళలకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.