
- ఉన్నతాధికారుల ఆదేశాలతో పలుచోట్ల పోలీసుల సోదాలు
- భారీగా నగదు, నగలు స్వాధీనం
- సిద్దిపేట జిల్లాలో 38 కేసులు, రూ. 1.21 కోట్లు సీజ్
సిద్దిపేట/ జగిత్యాల/ ఏటూరునాగారం/అశ్వారావుపేట, వెలుగు: రాష్ట్రంలో పలుచోట్ల అక్రమ ఫైనాన్స్ నిర్వాహకులు, వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఖమ్మంలో ఓ ఫైనాన్షియర్ వేధింపులతో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం వెలుగు చూడడంతో పాటు, ఫైనాన్స్ నిర్వాహకులపై రెండు నెలలుగా ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీంతో వారం రోజులుగా మొత్తం డేటా సేకరించిన ఆఫీసర్లు శనివారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టి పెద్దమొత్తంలో నగదు, బంగారం, డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారుల ఆగడాలపై వస్తున్న ఫిర్యాదుల మేరకే ఈ దాడులు జరిగాయని పోలీస్ అధికారులు చెప్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో రంగంలోకి 24 పోలీస్ టీమ్‌లు..
సిద్దిపేట జిల్లాలో అనుమతులు లేకుండా, అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారి ఇండ్లపై 24 పోలీస్ టీమ్‌లు ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 38 కేసులు నమోదు చేసి 1. 21 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడుల్లో 490 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, ఈ రైడ్ లలో 70 తులాల బంగారం, 13 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా అక్రమ ఫైనాన్స్‌లు నడుపుతూ అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఫైనాన్స్ వ్యాపారం నడిపేవారి వివరాలు సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 8712667100 కు సమాచారం ఇవ్వాలని కోరారు.
జగిత్యాల జిల్లావ్యాప్తంగా సోదాలు..
జగిత్యాల, మెట్ పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్‌లో వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడులు చేశారు. మెట్‌పల్లి చైతన్య నగర్‌కు చెందిన వ్యాపారి ఎలేశ్వర్ ఇంట్లో రూ. 15 లక్షలు విలువైన రెండు ప్రామిసరీ నోట్లు, రూ. 8 లక్షల విలువైన 7 చెక్కులు, 18 బ్లాంక్ చెక్కులు, రూ.3 లక్షులు సీజ్ చేశారు. భూమేశ్వర్ ఇంట్లో రూ. 63 లక్షల విలువైన 10 ప్రామిసరీ నోట్లు, 7 బ్లాంక్ చెక్కులు, రూ. 3 లక్షలు విలువైన చెక్కు, రూ. లక్ష స్వాధీనం చేసుకున్నారు.
రాజారాం ఇంట్లో రూ. 5.70 లక్షల విలువైన 20 ప్రామిసరీ నోట్లు, రూ. లక్ష సీజ్ చేసి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇబ్రహీం పట్నం మండలంలోని గోదూర్‌కు చెందిన బండి పురుషోత్తం వద్ద రూ. 8 లక్షల 3 వేలు విలువైన 17 ప్రామిసరి నోట్లు, రూ.30 వేలు విలువైన బ్లాంక్ చెక్, 23 రిజిస్టర్లు, సత్తెక్కపల్లికి చెందిన ఆరేళ్ల రాజా గౌడ్ వద్ద రూ. 36,45,000 విలువైన 18 ప్రామిసరీ నోట్లు, 20 రిజిస్టర్లు, రూ.1,69,370 స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
కోరుట్లలో రాజేశం ఇంట్లో సుమారు రూ. 69 లక్షల విలువ చేసే ప్రామిసరీ నోట్లు, రిజిస్టర్స్, రూ.1.28 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రాయికల్ మండలం ఇటిక్యాలకి చెందిన శ్రీనివాస్ వద్ద సుమారు రూ.18 లక్షల విలువైన 22 ప్రామిసరీ నోట్లు, అల్లీపూర్‌కు చెందిన రాజు వద్ద రూ. 1. 85 లక్షల విలువైన 2 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.
ములుగు జిల్లాలో..
ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన భూక్య కిరణ్ కుమార్, ఆయన భార్య సునీత ఇండ్లపై ఏఎస్పీ మహేశ్ గితే ఆధ్వర్యంలో దాడులు చేశారు. అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేసినట్లు ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపారు. తనిఖీల్లో ప్రామీసరీ నోట్లు, బాండ్ పేపర్లు, చెక్కులు, తనఖా పెట్టుకున్న భూమి పత్రాలు, రూ. 4,57,410 దొరికాయన్నారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఖమ్మం జిల్లాలో...
ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఫైనాన్స్ వ్యాపారుల షాపులు, ఇండ్లలో పోలీసులు దాడులు చేశారు. అశ్వారావుపేట సీఐ జితేంద్ర, ఎస్సై శ్రీరాముల శ్రీను ఆధ్వర్యంలో మూడు టీమ్‌లుగా విడిపోయి పట్టణంలోని ఓ బట్టల దుకాణం, రెండు ఫైనాన్స్ కంపెనీలు, ఒక గోల్డ్ షాప్‌లో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.