కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లాలో 20 నెలల కింద అదృశ్యమైన మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. కేసుకు సంబంధించిన వివరాలను ట్రైనీ ఐపీఎస్ కాజోల్‌సింగ్ శుక్రవారం కామారెడ్డిలో వెల్లడించారు. భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన సంధ్య (32) పని కోసం కామారెడ్డి వచ్చేది. ఈ క్రమంలో లేబర్ అడ్డా మీద దోమకొండ మండలం చింతమాన్‌పల్లికి చెందిన జంగంపల్లి మహేశ్‌తో పరిచయం ఏర్పడింది. 2022 సెప్టెంబర్ 14న పనికోసం కామారెడ్డికి వచ్చిన సంధ్యకు మహేశ్ ఫోన్ చేసి నర్సన్నపల్లి గేట్ వద్దకు రమ్మని చెప్పాడు. అక్కడ బీర్ బాటిల్స్ కొనుక్కొని ఇద్దరూ క్యాసంపల్లి శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. బీర్ తాగిన సంధ్య మత్తులోకి వెళ్లిన తర్వాత మహేశ్ ఆమెను బండరాయితో కొట్టి చంపేశాడు.
అనంతరం ఆమె వద్ద ఉన్న రూ.50 వేలు, బంగారు పుస్తెల తాడు, చెవి కమ్మలు, సెల్‌ఫోన్ తీసుకొని తన ఇంటికి వెళ్లిపోయాడు. పనికోసం వెళ్లిన సంధ్య తిరిగి రాకపోవడంతో ఆమె భర్త 16వ తేదీన భిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా ఎంక్వైరీ చేయగా మహేశ్‌కు చివరి కాల్ వెళ్లినట్లు గుర్తించారు. కానీ అప్పటికే మహేశ్ విదేశాలకు వెళ్లిపోయాడు. ఇటీవల గ్రామానికి వచ్చిన మహేశ్‌ను రెండు రోజుల కింద పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అనంతరం ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మహేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ట్రైనీ ఐపీఎస్ కాలోజ్‌సింగ్ తెలిపారు.