- ఫార్మసీ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్
- కిడ్నాప్, గ్యాంగ్ రేప్ కేసు నమోదు
- పోలీసుల అదుపులో ఆటోడ్రైవర్ గ్యాంగ్
- ఘట్కేసర్ సమీపంలోని యమ్నాంపేట్ శివారులో దారుణం
- బాధితురాలిపై రాడ్డుతో దాడి, టార్చర్
- సీసీటీవీ ఫుటేజ్‌తో ఆటో, నిందితుల గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: ఫార్మసీ స్టూడెంట్ కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు కిడ్నాప్, గ్యాంగ్ రేప్ జరిగినట్లు కేసు పెట్టారు. ఆటోడ్రైవర్ గ్యాంగ్ పై కేసులు నమోదు చేశారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ లీవ్‌లో ఉండడంతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ కేసును పర్యవేక్షిస్తున్నారు. దారుణానికి పాల్పడ్డ ఆటోడ్రైవర్లు ఈగ రాజు, భాస్కర్, నందన్, శివను అరెస్టు చేసి విచారిస్తున్నారు. నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. టెస్టులు చేసి విమెన్ అండ్ చెల్డ్ వెల్ఫేర్ హోమ్‌కు తీసుకెళ్లారు.
రాడ్‌తో దాడి.. టార్చర్
ఫార్మసీ స్టూడెంట్ బుధవారం సాయంత్రం ఆర్‌ఎల్ నగర్ లోని ఆమె ఇంటికి వెళ్లేందుకు రాంపల్లి చౌరస్తాలో సాయంత్రం 6:15కి ఆటో ఎక్కింది. ఆర్‌ఎల్ నగర్ లో ఆపకుండా వెళ్లిన డ్రైవర్ యమ్నాంపేట్ లో మరో ముగ్గురిని ఎక్కించుకున్నాడు. ఆటో ఆపకుండా స్పీడ్‌గా తీసుకెళ్తున్నాడని అప్పటికే ఆమె పేరెంట్స్‌కు ఫోన్ చేసి చెప్పింది. భయంతో స్టూడెంట్ కేకలు వేయడంతో నిందితులు రాడ్‌తో కొట్టారు. చంపేస్తామని బెదిరించారు. యమ్నాంపేట్ శివారులోని రైల్వే ట్రాక్ దగ్గరకు తీసుకెళ్లి రేప్ చేసి, అన్నోజిగూడ వద్ద వరంగల్ హైవేకు దగ్గరలో బాధితురాలిని వదిలేసి ఎస్కేప్ అయ్యారని పోలీసులు చెబుతున్నారు.
ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి..
బాధితురాలి తల్లిదండ్రులు బుధవారం 100కి చేసిన కాల్‌తో సాయంత్రం 6:29 గంటల నుంచి పోలీసులు సెర్చ్ చేశారు. బాధితురాలి సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా గాలించారు. . ఫార్మసీ స్టూడెంట్ బస్ దిగిన రాంపల్లి చౌరస్తా నుంచి ఆర్‌ఎల్ నగర్, యమ్నాంపేట్, అన్నోజిగూడ వరకు సీన్ ఆఫ్ అఫెన్స్‌ను పరిశీలించారు. టవర్ లొకేషన్ ఆధారంగా రాత్రి 7.50గంటల సమయంలో గాయాలతో అన్నోజిగూడ వద్ద పడిఉన్న బాధితురాలిని పోలీసులు గుర్తించారు. వెంటనే హాస్పిటల్ తరలించారు. తర్వాత మల్కాజ్ గిరి డీసీపీ రక్షిత కె.మూర్తి బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. కిడ్నాప్, దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా యమ్నాంపేట్‌కు చెందిన ఆటోడ్రైవర్లు ఈగ రాజు, భాస్కర్, నందన్, శివను అరెస్ట్ చేశారు. నిందితులను యాదాద్రి భువనగిరికి తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. పక్కా ప్లాన్ ప్రకారమే యువతిని కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు బుధవారం సాయంత్రం రాంపల్లి చౌరస్తాలో రెక్కీ వేసి ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు. శుక్రవారం కేసు వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.
ఆర్‌ఎల్ నగర్‌లో ఆందోళన
జరిగిన దారుణంపై ఆర్‌ఎల్ నగర్ వాసులు గురువారం ఆందోళనకు దిగారు. కాలనీలో రోడ్డుపై బైఠాయించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసి మహిళలకు మరింత భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన స్థానికులను పోలీసులు నచ్చచెప్పి పంపించారు.
కఠిన చర్యలు తీసుకుంటం
“ఇలాంటి ఘటనలు జరగడం దారుణం. బాధితురాలికి ట్రీట్మెంట్ ఇస్తున్నం. ఆరోగ్యం బాగానే ఉంది. మహిళలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రిపోర్టులు వచ్చాక వివరాలు వెల్లడిస్తాం. పోలీసులు తొందరగా స్పందించడంతో స్టూడెంట్ క్షేమంగా బయటపడింది. ఘటనపై స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రిపోర్ట్ ఇస్తాం.’’
‑ జ్యోతి పద్మ, మేడ్చల్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్