డిసెంబర్ 31న రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి పోలీసులు సోమవారం కౌన్సెలింగ్ ప్రారంభించారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ ఆధారంగా షెడ్యూల్ ఇష్యూ చేశారు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఫస్ట్ డే వందలాది మంది కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు.
హైదరాబాద్, వెలుగు :న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ ఆధారంగా షెడ్యూల్ ఇష్యూ చేశారు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మూడు సెంటర్స్‌లో సోమవారం నుంచి కౌన్సెలింగ్ సెషన్స్ ప్రారంభించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాత్రం ఎలాంటి కౌన్సెలింగ్ లేకుండానే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కౌన్సెలింగ్‌కి హాజరైన వారి వద్ద ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ప్రూఫ్స్ తప్పనిసరి చేశారు. తల్లిదండ్రులు లేదా భార్య సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. సిటీ కమిషనరేట్ లిమిట్స్‌లో నమోదైన కేసుల్లో గోషామహల్, బేగంపేట్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(టీటీఐ)లో కౌన్సెలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ లిమిట్స్‌లో నమోదైన కేసుల్లో ఎల్బీనగర్‌లోని టీటీఐలో కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండు కమిషనరేట్ల పరిధిలో మొదటి రోజు 757 మంది హాజరయ్యారు.
పోలీస్ డేటాబేస్‌లో డ్రంకెన్ డ్రైవర్స్ పేర్లు
శనివారం రాత్రి 10 గంటల నుంచే పోలీసులు కేసు లు నమోదు చేయడం ప్రారంభించారు. 3 కమిషనరేట్లలో కలిపి మొత్తం 3,173 కేసులు రిజిస్టర్ చేశారు. చెకింగ్ టైంలోనే ఫొటోతో పాటు బీఏసీ లెవల్స్ నమోదైన స్లిప్‌పై సంతకాలు తీసుకున్నారు. కౌన్సెలింగ్‌కి హాజరుకావల్సిన తేదీలతో రిసిప్ట్ ఇచ్చారు. సోమవారం కౌన్సెలింగ్‌కి హాజరైన వా రిని డ్రంకెన్ డ్రైవ్ కేసుల డేటాబేస్ ఆధారంగా చెక్ చేశారు. ఫోన్ నంబర్స్, పేరుతో పరిశీలించారు. కొత్తగా పట్టుబడ్డ వారిని బీఏసీ లెవల్స్ ఆధారంగా డేటాబేస్‌లో రికార్డ్ చేశారు. డెయిలీ 8 సెషన్స్ నిర్వహిస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 40 నుంచి 50 మందికి అవగాహన కల్పిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవింగ్‌తో జరిగే యాక్సిడెంట్స్‌పై షార్ట్‌ఫిల్మ్స్‌తో అవగాహన కల్పిస్తున్నారు.
పర్మిషన్ ఎందుకిచ్చిన్రు?
న్యూ ఇయర్ అంటే తాగుతరు. ఫ్రెండ్స్‌తో కలుస్తరు. గవర్నమెంటే తాగమని పర్మిషన్ ఇచ్చింది. తాగి బయటకు రాగానే పట్టుకున్నారు. అట్లయితే తాగమని ఎందుకు చెప్పాలి? కేసులు ఎందుకు పెట్టాలి? రూ.10 వేలు అంటే తక్కువ కాదు.. నెల జీతం.. తాగడానికి డబ్బులు ఇచ్చాం. ఈ కేసులో రూ.10 వేలు, జైలు శిక్ష ఉంటదని అంటున్నరు.
‑ పట్టుబడ్డ వ్యక్తి, దిల్‌సుఖ్‌నగర్
బండి సీజ్ చేసిన్రు
12 గంటల దాకా పర్మిషన్ అన్నరు. పది గంటలకే పట్టుకున్నరు. బార్‌కు కొంచెం దూరంలోనే చెక్ చేశారు. బైక్ మీద నేను ఒక్కడినే ఉన్నా. బండి సీజ్ చేశారు. కౌన్సెలింగ్‌కి వచ్చాను. మా బ్రదర్‌ను తీసుకొచ్చాను. కోర్టుకు హాజరుకావాలని చెప్తున్నారు. ఒంటిగంట దాకా బార్లు ఓపెన్ ఎందుకు పెట్టాలి? డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఎందుకు రిజిస్టర్ చేయాలి?
‑ పట్టుబడ్డ వ్యక్తి, ఛత్రినాక